సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): నగరంలో స్కైవాక్‌ల నిర్మాణం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. నగరంలో ప్రధాన జంక్షన్ల వద్ద వాహన ప్రమాదాలు తగ్గించడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేలా రూపొందించిన ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క ఉప్పల్ జంక్షన్ స్కైవాక్ వే తప్ప.. మెహదీపట్నం వద్ద ప్రారంభించిన స్కైవాక్ పనులు, సికింద్రాబాద్ జంక్షన్లో దాదాపు కిలోమీటర్‌కు పైగా విస్తీర్ణంతో చేపట్టిన స్కై వాక్ వే పనులు పూర్తికాలేదు.
నిర్మాణం పూర్తయ్యేదెన్నడో?
ముంబై హైవే, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాల్లో అత్యంత ట్రాఫిక్ మెహదీపట్నం జంక్షన్లో ఉంటుంది. సిటీ బస్సులు ఓవైపు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతోపాటు, నిత్యం వేలాదిగా ఐటీ కారిడార్‌కు ప్రయాణించే వాహనదారులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది. వాహనదారులతోపాటు, రైతు బజార్‌కు వచ్చేవారు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సిందే. దీంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా నడిచేందుకు వీలుగా స్కైవాక్ వేకు బీఆర్ఎస్ హయాంలోనే పనులు ప్రారంభించారు.
కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు సాగుతూనే ఉన్నాయి. తొలుత ప్రాజెక్టుకు రక్షణ శాఖ ఆమోదం లభించకపోయినప్పటికీ.. ఇటీవల ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా కూడా ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇక ట్రాన్స్‌పోర్టు హబ్‌గా పేరుగాంచిన సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ ప్రాంతంలో నిర్మించనున్న స్కైవాక్వే సికింద్రాబాద్ బస్ బే, రైతీఫైల్, ఉప్పల్ బస్బేతోపాటుగా, రైల్వే స్టేషన్‌కు వచ్చిపోయే వారికి వీలుగా ఉంటుంది.
ఎలివేటర్లు, ఇంటర్మీడియట్ టన్నెల్ వాక్‌లు, బస్ బే ఏరియా, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వంటివి స్కైవాక్ వేల ద్వారా అందుబాటులోకి వస్తాయి. కానీ ఏడాది కాలంగా ఉప్పల్ స్కై వాక్‌వే మినహా సికింద్రాబాద్ గానీ, మెహదీపట్నం ప్రాజెక్టులు గాని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక అందుబాటులో ఉన్న ఉప్పల్ స్కై వాక్ వే వద్ద నిర్వహణ లోపంతో తరుచూ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా లిఫ్టులు నిలిచిపోవడం, పారిశుద్ధ్య సమస్యతో బాటసారులు ఈ వాక్‌వేలో నడిచే సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారు.
మూడు భారీ స్కైవాక్ వే పనులకు శ్రీకారం..
బీఆర్ఎస్ హయాంలో నగరంలో హెచ్ఎండీఏ సంస్థ ప్రధాన జంక్షన్ల వద్ద మూడు భారీ స్కై వాక్ వేలను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో ఉప్పల్ స్కై వాక్ వేను మూడేళ్ల కిందటే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మెహదీపట్నం స్కైవాక్ వే పనులు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ స్కైవాక్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రణాళికలే కార్యరూపంలోకి రాకపోవడంతో నగరంలో ఈ ప్రాజెక్టుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. బహుళ ప్రయోజనాలు ఉండే ఈ స్కైవాక్ వేల నిర్మాణం వలన నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. గతంలో హెచ్ఎండీఏతోపాటు జీహెచ్ఎంసీ కూడా నగరంలో స్కైవాక్ వేలను నిర్మించింది. కానీ హెచ్ఎండీఏ ప్రారంభించిన రెండు ప్రాజెక్టులలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.