సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుపై రెండు నిర్దేశిత మార్గాల్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రతిపాదనలు రూపొందించింది. హెచ్ఎండీఏ అనుబంధ సంస్థగా ఉన్న హెచ్‌జీసీఎల్ 13 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, 5 ఏండ్ల పాటు నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం రూ.99.70 కోట్లు వెచ్చించనున్నారు. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఒక మార్గం, నార్సింగి నుంచి కోకాపేట, కొల్లూరు మీదుగా ఈదుల నాగులపల్లి వరకు ఉన్న మరో మార్గంలో సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
ఈ సైకిల్ ట్రాక్‌పై సోలార్ రూప్‌టాప్‌ను ఏర్పాటు చేసి, సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 13 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని నిర్మించేందుకు టెండర్లను హెచ్‌జీసీఎల్ ఆహ్వానించింది. ఈ నెల 3వ తేదీలోగా బిడ్లను దాఖలు చేయాలని గడువు విధించారు. టెండర్లో పాల్గొనే కంపెనీలు డిజైనింగ్, ఇంజినీరింగ్, సప్లయి, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి కార్యకలాపాలు చేయాల్సి ఉంటుందని, ఈ పనులన్నీ చేసే సంస్థల నుంచి టెండర్లను స్వీకరించి, పరిశీలించిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.