HMDA | సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్యారడైజ్ – మేడ్చల్ మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం క్లిష్టంగా మారింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనుండగా, ఇప్పటికే శంకుస్థాపన, భూ సేకరణ పనులను చేపట్టింది. అయితే, తాజాగా రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుల మార్గంలోనే రెండు మెట్రో లైన్ నిర్మించడానికి హైదరాబాద్ మెట్రో సంస్థ నిర్ణయించగా, ఇందుకు ప్రభుత్వం కూడా డీపీఆర్ తయారీకి ఆమోదం తెలిపింది. కాగా, ప్రభుత్వం ప్యారడైజ్ నుంచి డైరీ ఫాం మార్గాన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రమంలో… కొత్తగా మెట్రో రైల్ తెర మీదకు రావడం, దీంతో ఎలివేటెడ్ కారిడార్లోనే మెట్రో నిర్మాణం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే, హెచ్ఎండీఏ రూపొందించిన డిజైన్ల ప్రకారం, ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం అసాధ్యమేనని చెబుతుండగా, కొత్తగా డిజైన్లు రూపొందించాల్సి ఉంటుందని తెలిసింది.
నార్త్ సిటీ అభివృద్ధిలో ‘మెట్రో’ అత్యంత కీలకం
నార్త్ సిటీ అభివృద్ధిలో అత్యంత కీలకంగా మెట్రో మారింది. ఇప్పటికే రెండు మార్గాల్లో మెట్రో మార్గాలను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.., క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్యారడైజ్ – సుచిత్ర మార్గంలో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో మెట్రో కష్టమనే అభిప్రాయం హెచ్ఎండీఏ, మెట్రో వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. ఈ మార్గంలో ప్రధాన అడ్డంకిగా బేగంపేట్ ఎయిర్ పోర్టు, అదే విధంగా ఇరుగ్గా ఉండే స్థలాలేనని చెబుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ విషయంలోనే బేగంపేట్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో ఎలివేటెడ్ కారిడార్‌కు వీల్లేక అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి హెచ్ఎండీఏ డిజైన్ చేసింది. కాగా.., ఈ మార్గంలో ఉపరితల మెట్రో సాధ్యం కాదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా నేషనల్ హైవే సుచిత్ర మార్గంలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లతో ఈ మార్గంలో మెట్రో సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాతే నిర్ణయం
ప్రభుత్వం రెండు మార్గాలో మెట్రో నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ రూపొందించాలని హెచ్ఎంఆర్ఎల్ను ఆదేశించింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో డీపీఆర్ రూపొందించినా.., సాధ్యసాధ్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఈ మార్గంలో దాదాపు ఐదున్నర కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. కాగా, బేగంపేట్ ఎయిర్ పోర్టు సమీపంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి మాత్రమే ఇప్పటివరకు డిజైన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ ఈ మార్గంలో ఉంటుందా? లేక కేవలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును మాత్రమే చేపడుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.