Hyderabad | మణికొండ, జూన్ 3: కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా.. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసేశారు. మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారిని కబ్జా చేసిన ఓ నిర్మాణ సంస్థ.. అక్కడ ఓ గేటును కూడా నిర్మించింది. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం సైతం వారికి కొమ్ముకాస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్సింగి మున్సిపాలిటీలో పరిధిలోని కోకాపేట గోల్డెన్‌మైల్ కాలనీ సమీపంలోని కొత్తచెరువు ఎగువ ప్రాంతంలోని సర్వేనెంబరు 102లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం వంద అడుగుల రహదారి ఉంది. గత ఆరు నెలల కిందట వరకు ఆ రహదారిపై రాకపోకలు కొనసాగాయి. ఇదే రహదారిపై మున్సిపాలిటీ నిధులతో సగానికి పైగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం ఈ రహదారి మధ్యలోనే ఓ నిర్మాణ సంస్థ గేట్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేసింది. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే తామంతా మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడుకున్నాం.. ఎవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సమాధానం ఇస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని మూసివేయడమే కాక ప్రశ్నించిన వారిపై సెక్యూరిటీ గార్డులతో అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
ఈ నిర్మాణ రంగ సంస్థ సెల్లారు తవ్వడంతో రహదారి పూర్తిగా కుంగిపోయిందని.. దానికి మరమ్మతు చేయాల్సి ఉండగా మున్సిపాలిటీ అధికారులే తమను గేట్లు ఏర్పాటు చేసుకోమన్నారంటూ సదరు నిర్మాణదారులు చెబుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా కలిసి రాకపోకలను నిలిపివేసి అడ్డంగా గేటు పెట్టి రహదారిని కమ్మేసి అమ్మేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరేమో సర్కారు భూములను అప్పగించేస్తే.. మరికొందరు రహదారులను అప్పగించే సంస్కృతిని చాటుకోవడం వెనుక ఆంతర్యమేమిటనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి ప్రజల రాకపోకలకు అడ్డంగా రహదారిలో గేటును ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుని సజావుగా రాకపోకలకు అవకాశం కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.