బేగంపేట్, ఫిబ్రవరి 17: అనారోగ్య సమస్యలతో డిప్రెషన్లోకి వెళ్లిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర పోలీసు విభాగంలోని ఐటీసెల్‌లో కానిస్టేబుల్ గా (2014 బ్యాచ్) పనిచేసే రంగనాథ్ (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య గాజుల దాక్షాయిణితోపాటు ఒక కుమార్తె కూడా ఉంది.
కొద్ది రోజులుగా పోర్టల్ వెయిన్ థ్రోంబోసిస్, ఆర్టియో పోర్టల్ ఫిస్తులా వ్యాధితో బాధ పడుతున్నాడు. 2023లో దీనికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన మందులు వాడుతున్నాడు. కానీ అప్పటి నుంచి ఆయన తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాడు. ఆదివారం భార్య కుమార్తెతో కలిసి బోయిన్‌పల్లిలోని పుట్టింటికి వెళ్లింది. ఉదయం 11.15 సమయంలో భర్తకు వీడియో కాల్ చేయగా ఆయన ఫోన్ ఎత్తలేదు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆయన వెంటిలేటర్ గ్రిల్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని పిలువగా వచ్చి చూసే సరికి అప్పటికే మరణించాడు. మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని ధర్యాప్తు చేపట్టారు.