సుల్తాన్ బజార్, నవంబర్ 7: పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇస్తూవింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ భవన్, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక ముందు రానున్న జాబితాలో పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రమే చోటు కల్పించాలని అధినేతల కు వివిధ వర్గాలకు చెందిన నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రె స్ పార్టీ విడుదల చేస్తున్న అభ్యర్థుల జాబితాలో మొద టి నుంచి వివాదాస్పదంగానే మారింది. కాగా, మంగళవారం వనపర్తి నియోజకవర్గానికి మాజీ మంత్రి చిన్నారెడ్డికి టిక్కెట్ కేటాయిస్తూ పార్టీ అధిష్టానం జాబితాను విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, తిరిగి చిన్నారెడ్డికి కేటాయించిన టిక్కెట్‌ను రద్దు చేయడంతో గాంధీ భవన్‌కు చేరుకున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి అనుచరు లు, నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వనపర్తి టిక్కెట్‌ను మాజీ మంత్రి చిన్నారెడ్డికి రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు చిన్నారెడ్డిపై పార్టీకి రాజీనామా చేయాలని తీవ్ర స్థాయి లో ఒత్తిడి తీసుకువచ్చారు. చిన్నారెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని ఆందోళనకు దిగిన నాయకులను చిన్నారెడ్డి ఓదార్చారు. అయితే, పటాన్ చెరువు టిక్కెట్‌ను కాటం శ్రీనుకే కేటాయించాలని నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాటం శ్రీనుకు కాకుండా నీలం మధుకు ఎలా టిక్కెట్ కేటాయిస్తారని ఆందోళన బాటపట్టిన నాయకులను గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి టిక్కెట్ తనకే కేటాయించాలని కార్యకర్తలతో కలిసి బెల్లయ్య నాయక్ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు.
బంజారాహిల్స్: పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కష్టపడుతున్న కాటం శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా పార్టీ సభ్యత్వం కూడా లేని నీలం ముదిరాజ్‌కు ఎలా ఇస్తారంటూ వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి యత్నించారు. మంగళవారం ఉదయం పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నివాదాలు చేశారు. 100 కోట్లకు నీలం ముదిరాజ్‌కు టికెట్ అమ్ముకున్నాడంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
గత ఎన్నికల్లో సుమారు 80 వేల ఓట్లు సాధించిన కాటం శ్రీనివాస్ గౌడ్ పార్టీని కాపాడుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడని కన్నీళ్లపర్యంతమయ్యారు. రాత్రికి రాత్రే కోట్లాది రూపాయలు తీసుకుని పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని నీలం ముదిరాజ్‌కు టికెట్ ఇవ్వ డం ద్వారా కాంగ్రెస్ పార్టీని చంపేశాడని ఆరోపించారు. తమ నాయకుడికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, రేవంత్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కాం గ్రెస్ కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటివద్దకు వెళ్లేందుకు యత్నించగా పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.