Medchal | మేడ్చల్, అక్టోబర్ 13: దసరా వేడుకల్లో గొడవలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీలో దసరా రోజైన శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య రగడ జరుగగా, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సంబురాల వ్యవహారం దసరా కంటే నాలుగైదు రోజుల ముందే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. రెండు మున్సిపాలిటీల పరిధిలో జరిగిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రతి ఏటా దసరా సందర్భంగా పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించే రావణ దహన కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సారి మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరడంతో ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.
కానీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు ఆయనను సంబురాలకు రావాలని ఆహ్వానిచడమే కాకుండా.. ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీల్లో కొన్నింటిని అధికారులు శనివారం మధ్యాహ్నం తొలగించారు. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కావాలనే తమ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని ఆరోపించారు.
దసరా సంబురాలు నిర్వహించే సమయంలో సాయంత్రం ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేస్తున్నారని, ఆయన వచ్చిన తర్వాతే సంబురాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, నవీన్‌రెడ్డి, నడికొప్పు నాగరాజు, సందీప్‌గౌడ్, మహబూబ్ అలీ తదితరులు కోరారు. ఆయన రాక విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వాగతం చెప్పి, తీసుకువచ్చేందుకు వెళ్లారు.
వారు అంబేద్కర్ చౌరస్తా వద్దకు వెళ్లి ఎమ్మెల్యే మల్లారెడ్డి కోసం వేచి చూస్తుండగానే బాణాసంచా కాల్చడం మొదలుపెట్టారు. దీంతో అవాక్కయిన బీఆర్ఎస్ నేతలు సంబురాలు నిర్వహించే స్థలం వద్దకు పరుగెత్తుకొచ్చి, కాల్చడాన్ని ఆపి వేయించారు. ప్రొటోకాల్ ప్రకారం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే సంబురాలు ప్రారంభం కావాలి.. కానీ, అంతకు ముందు బాణాసంచా కాల్చడం ఏమిటని వాగ్వివాదానికి దిగారు. వారికి ఏసీపీ, సీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. మున్సిపాలిటీ నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాకుండానే నిర్వహించి, ప్రొటోకాల్‌ను అగౌరవపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరూ కాల్చిరో మాకు తెలియదని కాంగ్రెస్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోలేదు. కావాలనే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంబురాలు జరుగుతున్నందున చైర్‌పర్సనే రావణ దహనం చేస్తారని, ఆయన వచ్చే వరకు ఆగి ఉంటే బాగుండేదని అన్నారు. కాగా, కొద్ది సమయానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంబురాలు నిర్వహించే స్థలానికి చేరుకొని, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పి, వెళ్లిపోయారు. ప్రొటోకాల్ ప్రకారమే తాను సంబురాలకు హాజరయ్యానని, ఇలా చేయడం సరికాదన్నారు.
గుండ్లపోచంపల్లిలో మారిన వేదిక
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సైతం దసరా సం బురాల ముందే తగాదా తలెత్తింది. ప్రతి ఏటా బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో గుండ్లపోచంపల్లి- కొంపల్లి దారిలో ఉన్న నారాయణ చెరువు కట్టపై సంబురాలు నిర్వహిస్తున్నారు. అయితే, చెరువు కట్టపై సంబురాలు నిర్వహించడంతో బ్బందులు తలెత్తుతున్నాయంటూ సమీపంలో ఉన్న ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవడం వరకు వెళ్లింది. అయితే, కాంగ్రెస్ నేతలు కావాలనే సంబురాలను అడ్డుకునేందుకు ఇలా చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తాము కూడా సంబురాలు నిర్వహిస్తామని, అనుమతివ్వాలని కోరారు. దీంతో ఎవరూ కూడా అక్కడ సంబురాలు నిర్వహించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. చివరకు బీఆర్ఎస్ నేతలు సంబురాలు నిర్వహించే వేదికను నారాయణపూర్ చెరువు కట్టపై నుంచి సంతోష్ దాబా పక్కన ఉన్న ఓ ప్రైవేట్ బిల్డర్స్‌కు సంబంధించిన ఖాళీ ప్రదేశానికి మార్చారు.