జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఓటర్లను ఒకవైపు నోట్లతో ప్రలోభపెడుతూనే మరోవైపు లొంగదీసుకుం టున్నారు. డబ్బులు ఎరవేసి లాగే ప్రయత్నం చేయడంతో పాటు పోలీసులతో బెదిరిస్తున్నారు. మైనారిటీలు బీఆర్ఎస్ వెంటే ఉన్నట్లుగా తేలడంతో టార్గెట్ చేస్తున్నారు. వారి ఇళ్లల్లోకి ఎలాంటి సెర్చ్ వారెంట్లు లేకుండా రాత్రులు తనిఖీల పేరుతో వచ్చి భయభ్రాంతులకు గురిచేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 14 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో ఓటర్ల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు కుట్రలకు తెరదీస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసుల సహకారంతో బెదిరిస్తున్నారు. 5న సీఐ రమేశ్‌నాయక్ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ, ఒక మహిళాఎస్ఐ, టాస్క్‌ఫోర్స్ వహీద్, షేక్ అహ్మద్, షకీల్ ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడి వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు.
ఎందుకు వచ్చారని అడిగితే ఎలాంటి సెర్చ్ వారెంట్ లేదని తమకు పైనుంచి ఆదేశాలతో వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా చాలామంది యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలను పిలిచి మాట్లాడుతున్నారని, పార్టీ మారమని, లేకుంటే కేసులు పెడుతామని బెదిరిస్తున్నట్లు సమాచారం. చిరువ్యాపారులు సైతం వ్యాపారాలు నడిపించుకోవాలంటే కాంగ్రెస్‌కు మద్దతు తెలుపాలంటూ బెదిరిస్తున్నారు. ఎవరైతే ఓటర్లను ప్రభావితం చేయగలరో ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న 1.33లక్షల మైనారిటీ ఓట్లలో అత్యధిక శాతం ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల శాసనమండలి సభాపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు ముస్లిం పెద్దలకు ఫహీమ్ ఖురేషీ, ఫసియుద్దీన్ వంటి కాంగ్రెస్ నేతలే స్వయంగా ఫోన్ చేసినట్లు గులాబీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
బీఆర్ఎస్ నేతలపై కేసులు..
రహ్మత్‌నగర్ బస్తీలో ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ నేత అరుణ్‌ను 6న మధురానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఎస్ఐ శివశంకర్ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ లీడర్లపై బోగస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా అక్రమ కేసులు బనాయించి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. బోరబండ, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో ఎవరైతే గతంలో కేసుల్లో ఉన్నవారు కానీ, ఎప్పుడైనా పంచాయితీల్లో ఉన్నవారిని గుర్తించి బెదిరిస్తున్నారు. పోలీసులే స్వయంగా తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతుండడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని, పోలింగ్ బూత్‌ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.