సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఓరుగల్లు సభ సూపర్ సక్సెస్ కాబోతున్నదనే సంకేతాన్ని గ్రేటర్ గులాబీ దండు తమ సన్నాహక కార్యక్రమాలతో చాటడంతో.. జీర్ణించుకోలేని రేవంత్ సర్కార్ కుటిల రాజకీయాలకు తెర తీసింది. గ్రేటర్ అంతా పరుచుకున్న గులాబీ పోస్టర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ రాక్షసానందం పొందింది. కనిపించిన ప్రతీ బీఆర్ఎస్ పోస్టర్ను హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది అర్ధరాత్రుల్లో ప్రత్యేకంగా విధులు నిర్వర్తించి మరీ చించేశారు.
ప్రకృతి విపత్తు, వరదలు తదితర అత్యవసర సమయంలో రంగంలోకి దిగాల్సిన డీఆర్ఎఫ్ బృందాలు సైతం అర్ధరాత్రి విధులు నిర్వర్తించి గులాబీ పార్టీ పోస్టర్లను చించివేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పోస్టర్లు చించొద్దంటూ గులాబీ కార్యకర్తలు వేడుకున్నా వినిపించుకోకుండా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. కాంగ్రెస్ పోస్టర్లు ఎందుకు చించడం లేదంటూ నిలదీసిన ప్రజలను ఇష్టానుసారంగా తిడుతూ ఫోన్లు గుంజుకొని బెదిరించారు.
పోస్టర్లను చించి వాటిని హైడ్రా సిబ్బంది తమ వాహనంలో తరలించేయత్నం చేశారు. ఈ మార్గంలో హైడ్రా వాహనం అతివేగంతో మరో వాహనాన్ని ఢీకొట్టింది. హైడ్రా వాహనం ముందుభాగం పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో సదరు వాహనం వ్యక్తులు హైడ్రా సిబ్బందిని నిలదీశారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆరా తీయ గా.. వారి సమాధానం చెప్పకుండానే ‘హైడ్రా’ వాహనం వెళ్లిపోతుంది.. ట్రాఫిక్ క్లియర్ చేయండి” అంటూ సిబ్బంది ఇన్స్పెక్టర్ అధికారికి చెప్పడం విస్మయానికి గురిచేసింది.
కాగా, గోడలపై పోస్టర్లు చించేయగలరేమో.. కానీ గుండెల్లో కేసీఆర్పై అభిమానాన్ని చెరపలేరంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఫ్లెక్సీ పెట్టుకునే స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెదరని సంతకమే కేసీఆర్ అంటూ..సాయిరామ్ అనే నెటిజన్ తన అభిప్రాయం పంచుకున్నాడు. బీఆర్ఎస్ సభ పేరు వింటేనే కాంగ్రెస్ సర్కార్లో వణుకు పుడుతోందని మరో నెటిజన్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.