బంజారాహిల్స్, జూలై 9: 18 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం నేర్పించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీ విభాగం కార్యకర్తల సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో త్వరలో ఉప ఎన్నిక రానుందన్నారు.
పదేళ్లలో మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన సాయం గత ఐదు దశాబ్దాలలో ఎవరూ చేయలేదని వారు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎంతో బాగా పనిచేశారని, బీఆర్ఎస్ సీటైన జూబ్లీహిల్స్‌ను తిరిగి గెలుచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉందన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలంతా బాధలు పడుతున్నారని, ఉపాధి కోల్పోయారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చేశారన్నారు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికలో గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నేత సర్దార్‌ను ఏడాదిన్నర పాటు అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి, ఆయని ఇంటిని కూల్చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మరోసారి బీఆర్ఎస్ జెండాను జూబ్లీహిల్స్ గడ్డమీద ఎగురవేయాలని సూచించారు.
కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్‌లో గెలుద్దాం: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికి తీసుకువెళ్లి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం సాధించేలా పనిచేద్దామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారులను సైతం కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సర్దార్ మరణానికి ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి బుద్ది చెప్పాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని ఢిల్లీదాకా చాటి చెప్పాలని సూచించారు. డివిజన్ వారీగా మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంచార్జీలను నియమించుకోవాలని, ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌పార్టీ నేతల అరాచకాలను, మోసాలను వివరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.