సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపాదిత ఎలివేటెడ్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పాలన గ్రహణంలా మారింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును తామే డిజైన్ చేశామంటూ హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో అటు భూ బాధితులు, ఇటు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. 18కిలోమీటర్ల మేర పొడవైన ఈ ప్రాజెక్టును జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించేలా ఉన్న ప్రతిపాదనలతో ఈ మార్గాల్లో రవాణా రూపురేఖలే మారనున్నాయి.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నీరుగార్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమనే అభిప్రాయం జనాల నుంచి వస్తోంది. ఒకప్పుడు ప్రాజెక్టుల డిజైన్లు రావడమే ఆలస్యం చకచక పనులు మొదలయ్యే పరిస్థితుల నుంచి గడిచిన ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ప్రణాళికలు పట్టాలెక్కడమే గగనమైంది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 18 నెలల కాలంలో శంకుస్థాపన చేసిన మొదటి ప్రాజెక్టు కూడా ఎలివేటెడ్ కారిడార్ కాగా, ఇప్పటికీ కనీసం భూ సేకరణ కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ బీఆర్ఎస్ పాలనలో శంకుస్థాపన చేసి పనులు పూర్తయిన ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రక్షణ శాఖ నుంచి భూముల బదలాయింపు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం భూముల బదలాయింపునకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలిగినట్లే అని భావించారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భూసేకరణ చేయడానికి బాధితులకు పరిహారాన్ని ముందు తేల్చాలి. భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చే పరిహారంతో తమకు జరుగుతున్న నష్టం భర్తీ కాదని బాధితులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని గ్రామ సభలు, భూ సేకరణ కార్యక్రమాలను బాధితులు హాజరు కాకుండానే నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలుమార్లు భూసేకరణ నోటీసులు జారీ చేసినా… వందలాది మంది బాధితులు పరిహారం విషయంలో న్యాయం కోరుతూ కోర్టులను ఆశ్రయించారు. ఇంత జరుగుతున్న ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే భూసేకరణ కీలకమని తెలిసినా…. ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి పెట్టకుండా, ప్రాజెక్టును మరింత వివాదాస్పదం చేయడమే లక్ష్యంగా బాధితులపై కేసులు, వరుసగా నోటీసులు జారీ చేస్తోంది.
హెచ్ఎండీఏతోపాటు, రెవెన్యూ విభాగాల సమన్వయ లోపం కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి కూడా తూతూ మంత్రంగానే సమీక్షల సమయంలో ప్రస్తావించి ప్రాజెక్టును పక్కన పడేస్తున్నారు. అల్వాల్ సమీపంలోని టిమ్స్ ప్రాంగణంలో శంకుస్థాపన సమయంలో హాజరైన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ప్రాజెక్టు పరిసరాలను పర్యవేక్షించలేదు. నల్సార్ యూనివర్సిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిపోయే సమయంలోనైనా ఎలివేటెడ్ బాధితులు నిరసన తెలిపారు. కానీ జనాల్లో ఉంటానంటూ చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి… వారిని అడ్డుకుని అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.