లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం సామాన్యుడి ఆస్తికి భరోసానిచ్చే మార్గంలా కాకుండా, ప్రభుత్వ ఖజానా నింపుకొనే అక్షయ పాత్రలా మారింది. అధికారంలోకి వచ్చేందుకు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రిబేట్ల పేరిట ఊరిస్తుందే తప్పా జనాలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. తాజాగా ఎల్ఆర్ఎస్లో 25శాతం రిబేట్ ప్రకటించిన సర్కారు.. ఇప్పటివరకు ఫీజులు కట్టిన వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా వేధిస్తూనే ఉంది. వేలాది దరఖాస్తులు ఎల్1, ఎల్2 దశల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ఇప్పటికే వేల రూపాయలను పురపాలక సంస్థలకు చెల్లించిన వారు ఉండగా, కొత్తగా ఫీజులు వసూలు చేసేందుకు 25శాతం రిబేట్ ప్రకటించి, మరో గందరగోళానికి తెరతీసింది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ)
ఎల్ఆర్ఎస్ అనేది ఒక నిరంతర ప్రక్రియలా, ఎప్పటికీ ముగియని సంక్షేమ పథకంలా కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ఈ పథకం ద్వారా సామాన్యుడికి కలిగే ప్రయోజనం కంటే సర్కారు వచ్చే ఖజానాయే ఎక్కువగా ఉంది. దరఖాస్తు చేసుకున్న వేల మందికి ప్లాట్ యజమానులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కనిపించడం లేదు. ఇక ఫీజులు చెల్లించి నెలలు గడుస్తున్నా ప్రొసీడింగ్స్ జారీ చేయకుండా జాప్యం చేస్తున్న హెచ్ఎండీఏ.. త్వరలోనే పరిష్కరిస్తాం అనే ప్రకటనలకే పరిమితమైంది.
పదివేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చిన సర్కారు… దీంతో ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి గడువును మే 1 నుంచి జూలై 31వరకు పొడిగించింది. అయితే సర్కారుకు ఇప్పుడున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా.. మరోసారి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నింపుకొనేలా ఎల్ఆర్ఎస్ గడువును జూలై 31 వరకు అవకాశం కల్పించినట్లుగా చెబుతున్నారు. తాజాగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మరోసారి ఫీజులు చెల్లించే అవకాశమిస్తే, ఆదాయం వస్తుందని భావించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం కూడా దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేసేటప్పుడు చూపించిన ఉత్సాహం, సమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదు. ఫీజులు మొత్తం చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక సాంకేతిక కారణాలు, బఫర్ జోన్, ప్రభుత్వ భూములంటూ వేలాది దరఖాస్తులను తిరస్కరించింది. కానీ తిరస్కరించిన దరఖాస్తుదారులకు చెల్లించిన ఫీజులు వెనక్కి తిరిగి ఇవ్వకుండా సర్కారు వేధిస్తోంది. ఫీజులు వాపస్ రాకపోవడంతో ఆ సొమ్మును సర్కారు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తుందనే విమర్శలు ఉన్నాయి.
ఖజానా నింపుకొనే క్రమంలో రిబేట్లతో సర్కారు ఎరా వేస్తుందే తప్పా… కోట్లాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించినట్లుగా 25శాతం రిబేట్ ఇప్పుడు దరఖాస్తుదారుల్లో కొత్త చిచ్చు పెట్టింది. ఇప్పుడు కట్టినవారికి రిబేట్ సరే, మరి గతంలో కట్టిన వారి పరిస్థితి ఏంటని దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. ఫీజులు చెల్లించిన వారు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయంపై మండిపడుతున్నారు. ముందు కట్టిన వారికి అదనంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారా? లేక సర్దుబాటు చేస్తారా? అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ రద్దు చేయకుండా, రిబేట్లతోనైనా ఖజానా నింపుకొనే యోచనలో ఉంది.
కనీసం ఈ మూడు నెలల పాటైన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటారు. అర్హత లేని దరఖాస్తులను వెంటనే గుర్తించి, ఫీజులు సత్వరమే వెనక్కి ఇవ్వాలంటున్నారు. పాత దరఖాస్తదారులకు కూడా రిబేట్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును రిబేట్తో కలిపి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తం ఫీజులు చెల్లించిన వారికి వేగంగా ప్రోసీడింగ్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుని, వేలాది దరఖాస్తుదారులకు ఊరట నివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.