సిటీ బ్యూరో, అల్లాపూర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నట్లుంది కాంగ్రెస్ తీరు. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నది. హైదరాబాద్ పరిధిలో గత బీఆర్ఎస్ నిర్మించిన ఫ్లై ఓవర్లకు ప్రారంభోత్సవాలు చేసి తామే నిర్మించినట్లు గొప్పలు చెప్పుకొన్నారు. గ్రేటర్ సహా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన నిర్మాణాలు, కట్టడాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి.. తామే చేసినట్లు గప్పాలు కొట్టుకుంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, రాత పరీక్షలు పూర్తి చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి తామే ఇచ్చినట్లు నిరుద్యోగులను మభ్యపెట్టే విఫలయత్నం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2020లోనే ప్రారంభించి, వాడుకలోకి తీసుకొచ్చిన గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌ను 2024లో రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్లు శిలాఫలకం వేసుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఒక్క పని చేయకపోగా పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన పనులు కూడా తామే చేసినట్లు చెప్పుకోవడంతో జూబ్లీహిల్స్ ప్రజలు నవ్వుకుంటున్నారు.
2020 అక్టోబర్ 4న ప్రారంభం…
జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్లో గౌడ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు 2017లో నాటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. రూ.25.5 లక్షల నిధులతో నిర్మాణం ప్రారంభించి 2020 అక్టోబర్‌లో పూర్తి చేశారు. గౌడ కులస్తులు సభలు, సమావేశాలు నిర్మించేందుకు కమ్యూనిటీ హాల్‌తో పాటు భవనం ముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పనులన్నీ పూర్తయ్యాక అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పాటు, పాపన్న గౌడ్ విగ్రహాన్ని అక్టోబర్ 4న చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అప్పటి డిప్యూటీ మేయర్, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు బాబాఫసియుద్దీన్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి కమ్యూనిటీహాల్ అందుబాటులోకి వచ్చింది.
2024లో కాంగ్రెస్ కొత్త శిలాఫలకం..
2020లో ప్రారంభమైన గౌడ సంఘం కమ్యూనిటీహాల్ శిలాఫలకాన్ని తొలగించి, 2024 ఆగస్టు 18న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్లు కొత్త శిలాఫలకం ఏర్పాటు చేసుకున్నారు. ఐదేండ్ల నుంచి వాడుకలో ఉన్న దాన్ని మళ్లీ ప్రారంభించడమేంటని కమ్యూనిటీహాల్‌కు వచ్చిన గౌడ కులస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క నిర్మాణం చేపట్టని కాంగ్రెస్.. బీఆర్ఎస్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నదని విమర్శిస్తున్నారు. చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడానికి మరీ ఇంతలా దిగజారాలా? అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ చేష్టలకు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అసహ్యహించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే జూబ్లీహిల్స్ మొత్తాన్ని తామే అభివృద్ధి చేశామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని విమర్శిస్తున్నారు.
దిగజారుడు రాజకీయాలు
రెండేండ్ల నుంచి కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలే చేస్తున్నది. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం. బోరబండ గౌడ సంఘం కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మార్చడం సిగ్గుచేటు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలను చూసి బోరబండ ప్రజలు నవ్వుకుంటున్నారు.
-కృష్ణమోహన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు, బోరబండ