సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్యానిక్ మోడ్‌లోకి వెళ్లిపోయి, తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చి రెండేండ్లే అయ్యింది.. అంతలోనే కాంగ్రెస్‌పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ముఖ్యమంత్రి వన్‌సైడ్‌గా మద్దతు తెలిపి టికెట్ ఇప్పించినట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రౌడీషీటర్ ముద్ర ఉన్న ఆ కుటుంబానికి టికెట్ ఇస్తే సమస్యలు వస్తాయన్న విషయాన్ని సీఎం పట్టించుకోలేదని,
తన స్వప్రయోజనాల కోసం నవీన్‌యాదవ్ వైపు మొగ్గు చూపారని సొంత పార్టీ నాయకులు అంతర్గత సమావేశాల్లో కుండ బద్దలు కొడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఆయా సర్వే రిపోర్టులు వస్తుండటంతో హైదరాబాద్ జిల్లాపై పట్టున్న కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఫిరోజ్‌ఖాన్ లాంటి నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. తమపై నమ్మకం లేకనే ఎంఐఎం మద్దతు కోరుతండటంతో దూరంగా ఉన్నామని చెప్పుకొంటున్నట్లు తెలిసింది. గెలుపైనా, ఓటమి అయినా సీఎందే బాధ్యతంటూ మంత్రులు సైతం చేతులు ఎత్తేసినట్లు సమాచారం.
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కుట్రలను గుర్తించిన ముస్లిం ఓటర్లు ఆ రెండు పార్టీల నాయకులు చెప్పే మాటలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ముస్లిం ఓటర్లు తమకు దూరమయ్యారనే సమాచారంతో అఘామేఘాలపై సీఎం రేవంత్ పడరాని పాట్లు పడుతూ స్టంట్లు వేస్తున్నాడంటూ జూబ్లీహిల్స్‌లోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముంబయికి వెళ్లి సల్మాన్‌ఖాన్‌ను కలవడం, ఎమ్మెల్యే టికెట్‌కు పనికిరాడని పక్కన పెట్టిన అజారుద్దీన్‌కు అఘామేఘాలపై మంత్రి పదవి ఇవ్వడంలో ఆంతర్యమేంటో అర్థమైందని, ఇది ముస్లిం ఓటర్ల కోసం ఎత్తుగడ అని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు తాము తలొగ్గమని ముస్లింలు తేల్చి చెబుతుండటం గమనార్హం. అలాగే ముస్లింలకు స్మశాన వాటిక స్థలం విషయంలో పొంతన లేని నిర్ణయాలు తీసుకొని ముస్లింలకు అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
కాంగ్రెస్‌లో పి.జనార్దన్‌రెడ్డి పేదల నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటిది రెండేండ్ల నుంచి పీజేఆర్ పేరును ప్రస్తావించని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఓట్ల కోసం ఆయన జపం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి సైతం పీజేఆర్ స్థానికుడు కాదంటూ నోరు పారేసుకున్న సందర్బాలున్నాయి. దీంతో పీజేఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఈ విషయం తెలుసుకొని బోరబండ సర్కిల్లో పీజేఆర్ విగ్రహం పెడుతామంటూ చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ జిమ్మిక్కులు ఇక్కడ నడవవంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటుండటం కొసమెరుపు. మాగంటి గోపీనాథ్ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించారని తామంతా మాగంటి సునీతా గోపీనాథ్ వెంట నడుస్తామని కుండబద్దలు కొడుతున్నారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని, విష్ణువర్ధన్‌రెడ్డి నేడు మాగంటి సునీత తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తు చేస్తున్నారు.
కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం జిమ్మికులు చేస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడొచ్చి అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెడుతామంటే నమ్ముతామా? మాగంటి గోపీనాథ్ యూసుఫ్‌గూడలో ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడో పెట్టారు. మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆయన అడుగుజాడల్లో నడిచారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీఠ వేసింది ఆయనే. నేర చరిత్ర ఉన్న కుటుంబ సభ్యులను ఎన్నికలో పోటీ చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మస్కా కొట్టాలని చూస్తే నమ్ముతామా? అంటూ ఆ సామాజిక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
సినీ కార్మికులను మభ్య పెట్టేందుకు యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. అయితే సినీ కార్మికుల పొట్టకొట్టేలా అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం పార్టీకి శాపంగా మారిందనే చెప్పాలి. సినీ కార్మికుల వేతనాల పెంపు కోసం సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదని కార్మికులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇది గుర్తించిన సీఎం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆచరణకు సాధ్యం కాని హామీలివ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు బహిరంగానే చర్చిస్తున్నారు. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ అంటూ కొత్త డ్రామాకు తెర లేపాడని, వారి సంక్షేమానికి రూ.10 కోట్లు ఇస్తానని, కొత్త సినిమాల ధరలు పెంచినప్పుడు అందులో నుంచి 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలంటూ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని కార్మికులు దుమ్మెత్తిపోస్తున్నారు.