సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు మొదలు పెట్టారు. ప్రార్థనాలయాలలో ప్రచారానికి వీలులేకున్నా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బోరబండలో కాంగ్రెస్ నాయకులు ప్రార్థనాలయంలో గురువారం ఏర్పాటు చేసుకున్న రహస్య సమావేశంలోనే కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. చాల చోట్ల మైనారిటీ నాయకులు, ఓటర్లు ఈ రహస్య సమావేశాలను, కాంగ్రెస్ నాయకులను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తులు వేస్తున్నారని, మీ మాయ మాటలను మేం నమ్మే పరిస్థితుల్లో లేమంటూ కాంగ్రెస్ నాయకుల ముఖం మీదే చెబుతున్నారంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. ప్రార్థనాలయాల వద్ద శుక్రవారం ఆయా పార్టీలు ప్రచారం నిర్వహించగా, కొన్ని చోట్ల సాధారణ ప్రజలు కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డారు.
ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఎవరికి ఓటు వేయాలో తమకు బాగా తెలుసంటూ కాంగ్రెస్ నాయకులను కొన్నిచోట్ల తిట్టి పంపారు. ప్రజల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతను గుర్తించిన మంత్రులు సైతం మెల్లగా ఆయ ప్రాంతాల నుంచి పక్కకు జారుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోతామనే తమ సర్వేలు చెబుతుండటంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందని, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తాము లేమంటూ ఆయా ప్రార్థనాలయాల వద్ద యువకులు, పెద్దలు మాట్లాడుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ కాలనీలు, బస్తీలలో కనీసం 10 ఓట్లను ప్రభావితం చేసే చిన్న చిన్న నాయకులు, ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. మాట వినని వారిపై పోలీసులు దౌర్జన్యకాండకు దిగుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
ప్రార్థనాలయాల్లో కొందరు కాంగ్రెస్ నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అధికారులకు ఈ విషయంపై స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అటు వైపునకు వెళ్లడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తే ఎన్నికల అధికారులు పోలీసులకు చెప్పాల్సి ఉండటంతో స్థానికంగా ఉండే పోలీసులు ఇలాంటి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ చోటామోటా నాయకులు ఎక్కడికక్కడ ప్రార్థనాలయాలను కేంద్రంగా చేసుకొని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రార్థనాలయాల వద్ద ఎవరైనా అడ్డు చెబితే అక్కడే పక్కనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ రహస్య సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరికి పడకపోవడంతో గల్లాలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల పంపకాల విషయంలో తేడాలు వస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్ కొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటూ ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.
జూబ్లీహిల్స్లో స్థానికంగా ఉండే చోటామోటా కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రచారం కోసం తిరుగుతున్న మంత్రులకు సామాన్య ఓటర్లు ఝలక్ ఇస్తున్నారు. ఓటర్ల నుంచి వస్తున్న స్పందనను చూస్తూ మంత్రులు షాక్కు గురవుతున్నారు. తమ పార్టీపై ఇంత వ్యతిరేకత ఉందా అంటూ వాళ్లు మాట్లాడుకుంటున్నారంటూ పలువురు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుండగా సామాన్య ప్రజలు వాళ్లను తిట్టి పంపారు, అప్పుడు ఓ మహిళా మంత్రి అక్కడే ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన విధానం చూసి ఆమె కూడా షాక్ అయ్యినట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు.