ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ దూకుడు ఏకపక్షంగా సాగుతున్నది. అటు చేరికలు, ఇటు ప్రచారంలో అభ్యర్థులు టాప్‌గేర్‌లో వెళుతున్నారు. అభ్యర్థులకు అడగడుగునా ఘనస్వాగతం లభిస్తున్నది. ఇప్పటికే రెండు మార్లు ప్రచారం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. అంతర్గత కలహాలు, నిరాశ, నైరాశ్యంతో విపక్ష పార్టీలోని నాయకులు ఆ పార్టీలను వీడుతూ గులాబీ కండువా కప్పుకుంటున్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సెక్రటరీ, ఉప్పల్ నియోజకవర్గ ఆశావహులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష కారెక్కారు. దీంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సమక్షంలో పలువురి కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 27/ఉప్పల్: ఉప్పల్ కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం రాజ్యమేలుతున్నది. పూటకో ఫిరాయింపు, రోజుకో షాక్‌తో కాంగ్రెస్ పార్టీలో వలసలు విపరీతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకీ పెద్ద షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి మూడోసారి కూడా అధికారంలోకి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే గట్టిగా నమ్ముతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రానున్న దరిమిలా.. కాంగ్రెస్ పార్టీలో తమకు ఉనికే లేకుండా పోతున్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడీ బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బండారు లక్ష్మారెడ్డి గెలుపు ధీమాతో ప్రచారం జోరు పెంచారు. ప్రచారంలో కారు వేగంతో దూసుకుపోతున్న విధానాన్ని ఇతర పార్టీల వారిని అకర్షిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉప్పల్ నియోజకవర్గం మౌలిక సదుపాయాలు ఏర్పాటు, సెజ్‌లు ఏర్పాటు, ఐటీ కారిడార్, రియల్ఎస్టేట్, స్కైవాక్‌లు, మినీ శిల్పారామం, రోడ్ల వెడల్పు, ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు భారీ ఫ్లై ఓవర్ వంటి అనేక అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పల్ నియోజక వర్గానికి చెందిన ప్రజలు కూడా బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం తమ ఓట్లు వేసి గెలిపించుకుంటామని అంటున్నారు.
కాంగ్రెస్‌కు దూరమవుతున్న నేతలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం నేపథ్యంలో ఉప్పల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ బడా నేతలు దూరమవుతున్నారు. అందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, పూడూరి జితేందర్‌రెడ్డి, మేడల మల్లికార్జున్ గౌడ్, కాలేరు జైనవీన్, ఆశు, తదితర నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కారు పార్టీలో చేరారు. అదే విధంగా హబ్సిగూడ, చిలుకానగర్, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, ఏఎస్ రావునగర్ తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో యువత, నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏఎస్ రావు నగర్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన శిరీషారెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది.
షురూ కాని కాంగీ.. ప్రచారం…
ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి పెద్దగా ఒరిగేదీ ఏమీ లేదని లేదంటున్నారు స్థానికులు. బీఆర్ఎస్ అభ్యర్థికి పోటీ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ.. ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీకీ చెందిన సీనియర్ నాయకులు ప్రచారంలో పాలు పంచుకోవడం లేదు. దీంతో ఆ పార్టీ క్యాడర్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కొంతమంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. పార్టీలో సీనియర్లకు సరైన గౌరవం దక్కక పోవడం, పార్టీలో నాయకులలో సమన్వయం చేసే పెద్ద దిక్కు లేక పోవడం వంటి పలు కారణాలతో సీనియర్లు ఆ పార్టీనీ విడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
జోరుగా.. కారు ప్రచారం…
ఇప్పటికే ఉప్పల్ నియోజకవర్గంలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ప్రచారం చేస్తున్నారు. నియోజక వర్గంలోని అందరి ఇండ్లకు నేతలు వెళ్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం సూచనల మేరకు ఆ పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారితో నూతనోత్సాహన్ని నింపుకొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటు, వారిలో వారికే సమన్వయం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు. అలాగే మరో పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వలసలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీలో చేరగా, మరికొంత మంది శుక్రవారం పార్టీలో చేరారు. వీరిలో ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్‌రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి నేతల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఉప్పల్ నియోజక వర్గం గెలుపు బీఆర్ఎస్ పార్టీకి ఏక పక్షమే అవుతుందన్న అభిప్రాయాలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి.