బడంగ్పేట్, మార్చి22: రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 57వ డివిజన్ నాదర్గుల్లో శ్రీశ్రీ హోమ్స్‌లో స్విమ్మింగ్ పూల్‌ను, మధురానగర్ ఫేస్-2లో కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ మంత్రులు వేసిన శిలాఫలకాలకు దిక్కు దివాన లేకుండా పోయిందని ఆరోపించారు. మంత్రులు శంకుస్థాపనలు చేసిన పనులు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదన్నారు. ప్రజల సమస్యలను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పారిశుధ్యం పడకేసిందన్నారు.
విలీనం సరే.. అభివృద్ధి ఏది?
కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం సరే మరి సమస్యల సంగతి ఏమిటో ప్రభు త్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాలనీల్లో కనీసం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. మంజూరైన నిధులకు టెండర్లు పిలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకులు పనులు అడ్డుకోవడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పిలిచిన వాటిని రద్దు చేయడం ఏమిటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనంత కాలం సమస్యలు పరిష్కారం కావన్నారు. అనంతరం పలు కాలనీల ప్రజలు ఎమ్మెల్యేకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, తుఫాన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పగడాల మురళీ, సుదర్శన్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, రంజిత్ కుమార్ గౌడ్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.