బంజారాహిల్స్,అక్టోబర్ 7: 20 నెలల పాలనలో ఏనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మూడు నెలల పాటు చేసిన హడావుడి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కాస్త నెమ్మదించారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ రోజుకో ఇద్దరు మంత్రులు నియోజకవర్గంలో పరుగులు పెడుతూ పోటీలు పడి శంకుస్థాపనలు చేశారు. బస్తీలు, కాలనీలు అని తేడాలేకుండా నోటికి వచ్చిన బడ్జెట్‌ను కేటాయించినట్లు నమ్మిస్తూ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు.
ఫొటోలకు ఫోజులిస్తూ వంద కోట్లయినా ఖర్చుచేసి జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తీరుస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు శంకుస్థాపనలతోనే ఆగిపోతున్నట్లు అర్థం అవుతోంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హయాంలో జూబ్లీహిల్స్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో కొత్త డ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు, వరదనీటి లైన్ పనులు పూర్తి చేశారు. కాగా ఎన్నికలు రావడంతో కొన్ని ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవంటూ పలు ప్రాంతాల్లో పనులను నిలిపి వేశారు. నిధులు విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పలుమార్లు లేఖలు రాసినా అధికారులు స్పందించ లేదు.
రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని సంజయ్‌నగర్ బస్తీకి చెందిన ప్రధాన రహదారిపై ఏడాది క్రితం సీవరేజ్ లైన్ వేశారు. పనులు పూర్తైన వెంటనే సీసీ రోడ్డు వేయాల్సి ఉండగా ఎనిమిది నెలలు గడిచినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. సుభాన్ కిరాణ షాపునుంచి బాలయ్య శ్మశానవాటిక మీదుగా సంజయ్‌నగర్ వడ్డెర బస్తీకి వెళ్తే రోడ్డులో జలమండలి చేపట్టిన తవ్వకాల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు, మహిళలు, బైక్‌ల మీద వెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నామని, 8 నెలలుగా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చే కాంగ్రెస్ నేతలకు గుణపాఠం నేర్పాలో తమకు తెలుసని హెచ్చరించారు.