Jubilee Hills By Election | జూబ్లీహిల్స్‌లో ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న రౌడీయిజం భరించలేక మాగంటి సునీత ఉద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఓటర్ల భయపడవద్దని సూచించారు. విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని మాగంటి సునీత అన్నారు. స్టేట్‌లో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్‌లో తిరుగుతున్నారని తెలిపారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు జూబ్లీహిల్స్‌లో ఏం పని అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వడం లేదని తెలిపారు.పోలింగ్ బూతుల్లోని టేబుళ్లను బయట పడేస్తున్నారని తెలిపారు. పోలీసులు వారి దగ్గరి టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. బిర్యానీల్లో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇస్తున్నారని చెప్పారు. బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వదిలేస్తున్నారని తెలిపారు. కొన్ని బూత్‌ల్లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వికలాంగులకు వీల్‌చైర్స్ కూడా సరిపడేంతగా పెట్టలేదని తెలిపారు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులకు దిగుతున్నారని అన్నారు.
ఓటింగ్‌కు ఇంకా నాలుగు గంటల సమయం ఉంది.. దయచేసి ప్రజలంతా బయటకొచ్చి ఓట్లు వేయాలని మాగంటి సునీత కోరారు. జూబ్లీహిల్స్ ఓటర్లు చైతన్యం ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీరాజ్యంగా మార్చేశారని తెలిపారు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చి రేపు నీ సంగతి చెప్తానని నన్నే బెదిరించారని పేర్కొన్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించాలని కోరారు. నా భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు.. కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని సునీత అన్నారు. 13వ తేదీవరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. 14వ తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.