ఖైరతాబాద్, జూలై 12 : మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్‌నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్‌కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో తమ కొడుకు (17) మొబైల్ ఫోన్లో ఇంటి దగ్గర రీల్స్ చేస్తున్న క్రమంలో సమీపంలో ఉన్న ఓ ఇంట్లో వాష్‌రూమ్ నుంచి వస్తున్న అబ్ద్దుల్ రహమాన్ అనే వ్యక్తి అందులో చిత్రీకరించబడ్డాడని, దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి, అతని సోదరులు ఖాలీద్, అలీతో కలిసి విచక్షణ రహితంగా కొట్టారని, అంతేకాకుండా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తమ కొడుకును పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు.
డిసెంబర్ 15న తీసుకెళ్లి 17న రాత్రి 11 గంటలకు వదిలివెళ్లారని చెప్పారు. ఆ సమయంలో తమ కొడుకు నడువలేని స్థితిలో ఉన్నాడని, ఫిర్యాదు చేసిన వారితో పాటు పోలీసులు కొట్టడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందన్నారు. గత ఆర్నెళ్లుగా ఉస్మానియా దవాఖానలో చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. తమ కొడుకుపై జరిగిన దాడిపై పోలీసులతో పాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదన్నారు.
ఇటీవల తమ కుమారుడు పుట్టుకతోనే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, నరాల బలహీనత ఉందని ఓ ధ్రువపత్రాన్ని సృష్టించారని, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ కేసును మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలని ఓ పోలీసు అధికారి ఒత్తిడి చేశాడని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తమ కొడుకు చదువుతోపాటు ఆటలో ఎంతో చురుకుగా ఉండేవాడని, ఎన్సీసీ కేడెట్‌గా శిక్షణ తీసుకున్నాడని తెలిపారు.
పుట్టుకతో అనారోగ్యంతో ఉంటే, నరాల వీక్సెన్ ఉంటే ఎన్సీసీకె ఎలా ఎంపికవుతాడని ప్రశ్నించారు. పోలీసులు, ఫిర్యాదుదారులు కొట్టడం వల్లే కాళ్లు పనిచేయకుండా పోయాయని వాపోయారు. ఫిర్యాదుదారులకు అం డగా కాంగ్రెస్ నేతలు ఉన్నారని, అం దుకే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులు, అధికారులపై చర్యలు తీసకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఆరోపణల్లో నిజం లేదు
తమ కుమారుడిని పోలీసుల కొ ట్టడం వల్లే కాళ్లు చచ్చుబడిపోయాయని రహ్మత్‌నగర్‌కు చెందిన రాం బాబు, కనకదుర్గ దంపతులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ పేరిట ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి గతేడాది యూసుఫ్‌గూడ ప్రాం తానికి చెందిన ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు స్నానం చేస్తుండగా, సదరు బాలుడు సెల్ ఫోన్ వీడియో తీశాడని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి కేవలం విచారణ చేసి పంపించామని పేర్కొన్నారు.
కేసులో లభించిన ఆధారాలు కోర్టుకి సమర్పించామన్నారు. నాలుగు నెలల తర్వాత రాంబాబు అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని, అతని ఆరోపణలపై విచారణ చే యగా, జన్యుపరమైన వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోయినట్లు తేలిందన్నారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు సేకరించామని, తమ పో లీసు సిబ్బంది, అధికారులు ఆ బాలుడిని కొట్టడం కాని, నిర్భందించడం కాని చేయలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.