Indiramma House | మేడ్చల్, జనవరి10(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లపై ఎంపికపై జరగుతున్న ప్రచారాలతో నిరుత్సాహానికి గురువుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీదే ఫైనల్ అంటూ కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అర్హులను గుర్తించడంలో ఇందిరమ్మ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించింది. అయితే దరఖాస్తుల ఆధారంగా సర్వేను నిర్వహిస్తున్నారు. మొదటి దశలో జాగా ఉన్న వారినే అర్హులుగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జాగా లేని ఇండ్లు లేని నిరుపేదలు ఆశలపై మొదటి విడతలో నీళ్లు చల్లినట్లయింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులను గుర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులు జోక్యం ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలు 33 గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,43 223 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రకటనతో మరింత మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
సంకాంత్రి పండగ సందర్భంగా అనేక సెలవు దినాలు వస్తున్నందున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరింత అలస్యమయ్యే అవకాశమున్నది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏడాది కిందట దరఖాస్తులు చేసుకుంటే ఇప్పుడు సర్వేను ప్రారంభించారని, అర్హుల ఎంపిక ఎప్పుడు చేస్తారని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. అర్హుల ఎంపికను త్వరతగతిన పూర్తి చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలకు పెత్తనం ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.