Sabitha Reddy | కందుకూరు, ఏప్రిల్ 17: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆపార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని సబితారెడ్డి విమర్శించారు. గురువారం కందుకూరు మండల పరిషత్ సమావేశపు హాలులో 105 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీలపై విమర్శలు చేయడంతో పాటు ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుపడటంతో.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదికాస్తా ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి దారి తీసింది .ఇరు వర్గాలను పోలీసులు సముదాయించి సమావేశం హాలులో నుంచి బయటకు పంపించారు. అనంతరం చెక్కుల పంపిణీ యథావిధిగా కొనసాగింది.
ప్రభుత్వానికి భంగపాటు తప్పదు..
అనంతరం కందుకూరులో ఎమ్మెల్యే సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతుబంధు రెండు పంటలకు ఎగనం పెట్టిందని విమర్శించారు. పేదింటి పిల్లల తల్లిదండ్రులకు భారం కావద్దని మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అండగా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తులం బంగారం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు .ఇప్పుడు చెక్కులు ఇస్తున్న వారితో పాటు ఇకమీదట కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి త్వరలో ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్, బీఆర్ఎస్ నాయకులు.. సురసాని సురేందర్ రెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, సామ మహేందర్ రెడ్డి, సురసాని రాజశేఖర్ రెడ్డి , మేఘనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, ఆనంద్, దేవీలాల్ నాయక్, ఇందిరమ్మ దేవేందర్, మాజీ సర్పంచ్లు గోపాల్ రెడ్డి, జ్యోతి , జంగయ్య ,చంద్రశేఖర్, పుల్లారెడ్డి, డైరెక్టర్ ఆనంద్, మాజీ డైరెక్టర్ పారిజాతం, దేవిలాల్ నాయక్, ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖర్, యూత్ నాయకులు.. కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి మహిళలు పాల్గొన్నారు.