సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే మోకాలడ్డుతున్నారు..ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని కేబీఆర్ పార్కు ఉనికి ప్రశ్నార్థకం చేస్తూ సర్కారు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తుందంటూ ఒకవైపు పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, దీనికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఈ క్రమంలోనే న్యాయస్థానాల్లో మూడు పిటిషన్లు కీలకంగా మారడంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు కేసులు తేలే వరకు కేబీఆర్ ప్రాజెక్టు మినహా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించి హెచ్ సిటీ ప్రాజెక్టు ఒత్తిడి నుంచి డైవర్షన్ చేసేందుకు సర్కారు నయా ఎత్తుగడ రచిస్తుండడం గమనార్హం.
పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంగా రూ. 1090కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులకు గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ప్రజా పాలన ఏడాది విజయోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అధికారులు గడిచిన 8 నెలలుగా పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నది. ఈ ప్రాజెక్టుకు ముందు నుంచి సరైన ప్రణాళిక లోపించింది.
భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, కేబీఆర్ పార్కు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇప్పటికే వ్యతిరేకించి కేబీఆర్ పార్క్ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని నిలువరించేలా, పర్యావరణాన్ని పెంపొందించాలని ఎన్జీటీలో నమోదైన కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ పార్టీ నేతకు తోడుగా ఓ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన సమీపంలో మరో యాజమాని వేర్వేరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దీంతో రోజురోజుకు న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోతున్న ఈ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలు కావడం కష్టంగానే ఉందని స్వయంగా అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం.
బంజారాహిల్స్ రోడ్ నం 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా గతంలోనే పలు భవనాలను మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన స్థలంలో 266 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోనుంది. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు.
సుమారుగా తన ప్లాట్‌లో 377 గజాల వరకు కోల్పోనున్నారు. ఈ రహదారి విస్తరణలోనే మరికొంత మంది ప్రముఖులు ఉన్నారు. మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి 205 గజాల స్థలాన్ని కోల్పోగా, అల్లు అర్జున్ మరో బంధువు శరత్‌కి చెందిన 134గజాల స్ధలాన్ని కోల్పోనున్నారు. ఇక సీవీఆర్ సంస్థ 480 గజాల స్థలాన్ని కోల్పోవాల్సి వస్తుండటంతో ప్రాజెక్టు భూసేకరణపై ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు.
హెచ్సిటీ ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన పనుల్లో భాగంగా రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లకు ఇప్పటికే భూ సేకరణ ప్రారంభం చేసినప్పటికీ, ఈ మొత్తం కేంద్రం ప్రకటించిన ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ అక్కడి పచ్చదనాన్ని ధ్వంసం చేసేలా ఈ పనులు చేపడుతున్నారంటూ ముగ్గురు పిటిషన్‌దారులు స్థల సేకరణను సవాల్ చేస్తూ మరికొందరు ఆస్తుల యాజమానులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు పరిశీలనలో ఉన్న స్థలాలు మినహా ఎలాంటి వివాదాల్లేని ముగ్ధా జంక్షన్ వంటి ప్రాంతాల్లో పనులు ప్రారంభించి ప్రాజెక్టు ప్రారంభం చేసినట్లు చూపించే ఎత్తుగడకు ఇంజినీర్లు వ్యూహరచన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డైవర్షన్ వైపు అడుగులు వేసి ప్రజల నుంచి ఒత్తిడిని తగ్గించుకోవాలని భావిస్తున్నది. వాస్తవంగా కోర్టు కేసులు వరుసగా పడుతుండడం, భూ సేకరణపై కనీస స్పష్టత లేకున్నా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి ఫైనాన్షియల్ కమిటీ, టెక్నికల్ కమిటీల ఆమోదం తీసుకుని ఏజెన్సీని ఎంపిక చేసిన తీరుపై విమర్శలు లేకపోలేదు.
ప్రస్తుతం ఏజెన్సీతో ఒప్పందం ఖరారు ప్రక్రియ సర్కారు పరిశీలనలో ఉండడం, కేబీఆర్ పార్కు మినహా ఖైరతాబాద్ జోన్‌లోని రూ.210 కోట్లతో చేపట్టే ఎఫ్ఎఫ్సీఎల్ జంక్షన్ ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద మూడు లేన్ల యూనివర్సల్ డైరెక్షనల్ అండర్ పాస్ పనులతో పాటు రూ.837 కోట్ల వ్యయంతో ఖాజాగూడ జంక్షన్, ఐఐటీ జంక్షన్లలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లపై ఇంజినీర్లు దృష్టి సారించి డైవర్షన్ వైపు అడుగులు పడడం గమనార్హం. కాగా టెండర్లపై పెట్టిన శ్రద్ధ భూ సేకరణ అంశంలో టౌన్‌ప్లానింగ్ అధికారులను సమన్వయపర్చడంలో ప్రాజెక్టు విభాగం విఫలం చెందిందని అరోపణలు ఉన్నాయి.