బడంగ్‌పేట, డిసెంబర్11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 100 మంది మంత్రి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని స్పష్టం చేశారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. మహేశ్వరం నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగు లేని శక్తిగా తీర్చిదిద్దడానికి కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బీఆర్ఎస్ అధ్యక్షుడు దుడ్డు కృష్ణ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వర్ణగంటి ఆనందం, మహేశ్వరం వైస్‌ఎంపీపీ సునితా అంధ్యానాయక్, దేవాలయ కమిటీ చైర్మన్ సుధీర్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు అలీ, టీఆర్ఎస్ నాయకులు కర్రోల చంద్రయ్య, అంబయ్య యాదవ్, నవీన్, ప్రభాకర్, బాలయ్య, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.