‘నీకు కార్డు కావాల్నా.. మేం ఇప్పిస్తాం.. మేము సిఫారసు చేస్తేనే.. కార్డు వస్తుంది.. మాకు ఎంతో కొంత ఇవ్వు..లేదంటే.. అసలు కార్డే రాకుండా చేస్తా’.. అని బెదిరింపులు.. మేం చెప్పినోళ్లకే కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆర్డర్లు.. రాజధానిలో కాంగ్రెస్ చోటా నాయకుల ‘రేషన్..కలెక్షన్ల దందా’ తీరు ఇదంటూ..నగరవాసులు ఆరోపిస్తున్నారు. నగరంలో రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో ఇదే అదునుగా ఎంట్రీ ఇచ్చిన హస్తం నేతలు..ఏకంగా దళారుల అవతారం ఎత్తి.. ‘చెయ్యి’ తడిపితేనే కార్డు అంటూ.. పేదలను ఒత్తిడికి గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మీ సేవ కేంద్రాల్లోనే అడ్డాలు ఏర్పాటు చేసి.. రూ. 1000 నుంచి రూ. 10,000 దాకా దండుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తుదారులు అత్యధికంగా ఉండటమే దళారులకు వరంగా మారింది. నగరంలో ఇప్పటి వరకు మెంబర్ ఎడిషన్ దరఖాస్తులు దాదాపు 2,3,000 వేలు ఉండగా, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 2.2 లక్షలపైగానే ఉన్నారు. వారిలో 55 వేలకు పైగా ఎంక్వైరీ పూర్తయింది. 25 వేల మందిని కొత్త కార్డులకు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు దాదాపు 3వేల దరఖాస్తుల వరకు రిజెక్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంకా కొంతమంది దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. అన్ని వివరాలను సమగ్రంగా చూసి నిర్ధారించేందుకు సమయం ఎక్కువగా పడుతుండటంతో రోజుకు వెయ్యి దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తవుతున్నదని అంటున్నారు. దీంతో కొంతమేర ఆలస్యమవుతున్నది. దీన్ని ఆసరాగా తీసుకుని కాలనీల్లోని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు దళారుల అవతారం ఎత్తి తాము సిఫార్సు చేస్తే రేషన్ కార్డు తొందరగా వస్తుందని దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. డబ్బులిస్తే పని తొందరగా పూర్తవుతుందనేసరికి చేసేదేమీ లేక లబ్ధిదారులు అడిగినకాడికి ఇస్తున్నారు.
ఈ దందాలోకి మధ్య దళారులు మీసేవ నిర్వాహకులు, ఎంక్వైరీ అధికారులను కూడా లాగుతున్నట్లు తెలుస్తున్నది. మీసేవ కేంద్రాల్లోనే తిష్ట వేసి దరఖాస్తుదారుల నుంచి డబ్బు వసూలు చేసి తాము కొంత తీసుకుని మరికొంత మీసేవ నిర్వాహకులకు ఇస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆయా కాలనీల్లో ఎంక్వైరీ చేసే అధికారులతో ముందుగానే మాట్లాడుకొని తాము చెప్పిన వారి దరఖాస్తులను ముందు గా పరిష్కరిస్తే డబ్బు ముట్టజెపుతామని మభ్యపెడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
మరికొన్ని చోట్ల కొంతమంది మీసేవ నిర్వాహకులు ఏకంగా విచారణ అధికారులతో మా ట్లాడుతూ.. తాము సూచించిన దరఖాస్తును తొందరగా పరిశీలించేలా కోరుతున్నారని, అందుకు దరఖాస్తుకింత ఇస్తామంటూ ఎర వేస్తున్నట్లు ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులు చెబితే అధికారులు సైతం ఏం చేయలేనిస్థితి ఏర్పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇలా పేద ప్రజల నుంచి వేలాది రూపాయలు దండుకొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దళారులు తమ వద్ద డబ్బులు తీసుకుంటున్నారని బయటకు చెబితే రేషన్ కార్డు రానీయకుండా చేస్తారేమోనని దరఖాస్తుదారులు భయపడుతున్నారు. రూ.వెయ్యి, రెండు వేలకు అధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారం అడ్డుపెట్టుకుని నాయకులు ఇబ్బందులు పెడతారని మిన్నకుంటున్నారు. డబ్బులు పోయినా రేషన్ కార్డు వస్తే కుటుంబానికి ఆసరా అవుతుందని భావిస్తున్నారు. నగరంలోని అంబర్పేట డివిజన్లో పలు కాలనీల్లో ఈ దందా జోరుగానే సాగుతుందని బాధితులు చెబుతున్నారు.
కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ బస్తీల్లోనూ ఇదే తరహా దందా కొనసాగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం ఏకంగా రూ.5 వేలు తీసుకున్నారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.నగరమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అధికారులు దళారులకు డబ్బులు ఇవ్వొద్దని అర్హులందరికీ కాస్త ఆలస్యమైనా రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్నారు.