సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ) : బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట అసలు చెరువే కాదని, వాటర్‌బాడీ కానిచోట చెరువు ఉన్నదంటూ సృష్టించేందుకు కాంగ్రెస్‌నేతలు, హైడ్రాతో కలిసి ప్రయత్నిస్తున్నారని అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి అన్నారు. బతుకమ్మకుంట పూర్తిగా ఖుష్కిగా పేర్కొన్నారని, డ్రై ల్యాండ్‌లో 1987వరకు వ్యవసాయం చేశారని, నాగమయ్యకుంట నుంచి కిందకు నీళ్లు వచ్చేవని, వాటిని సాగుకు అనుకూలంగా వాడుకునేవారమని తెలిపారు. బతుకమ్మకుంట విషయంలో తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయన్నారు. మంగళవారం సుధాకర్‌రెడ్డి తన దగ్గరున్న ఆధారాలు చూపుతూ మాట్లాడారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ రికార్డుల్లో ఎక్కడా బతుకమ్మకుంట చెరువు అని నమోదు కాలేదని, గ్రామ, టౌన్ సర్వేల ప్రకారం సర్వేనంబర్ 563/1, 2లో 9.9 ఎకరాల భూమి డ్రై ల్యాండ్ అని, ఇందులో 1.34 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఒకవేళ బతుకమ్మ కుంట వాటర్ బాడీ అయితే మే 25,1978లో ఏపీ గెజిట్ నోటిఫికేషన్లో బాగ్‌అంబర్‌పేట గ్రామంలోని సర్వే నెంబర్లు 563/1, 2 సయ్యద్ అజామ్ తదితరులకు చెందిన భూమిని డ్రైల్యాండ్అని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో అక్కడ ఖాళీస్థలంగా కూడా పలుశాఖల రికార్డుల్లో చూపించారని, చెరువు ఉంటే అక్కడ ఖాళీస్థలంగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. విలేజ్మ్యాప్లో అంబర్‌పేటలో ఎక్కడా కుంటలు లేవని స్పష్టంగా పేర్కొన్నారని, టౌన్ సర్వేలో కూడా డ్రై ల్యాండ్ అని ఎలా ఉందని ప్రశ్నించారు.
1999లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంబర్‌పేటలోని కొన్ని సర్వేనంబర్లలో మొత్తం 25 ఎకరాల్లో 18 ఎకరాలు మినహా మిగతా 7 ఎకరాల భూమిని మూడునెలల్లోగా క్లియర్ చేయాలని చెప్పారు. ఈ తీర్పులో వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి అడిగినట్లుగా పేర్కొని ఆ స్థలంలో వాటర్‌ట్యాంక్ కన్వర్షన్‌కు ఒప్పుకోలేదని, అటువంటప్పుడు ఇప్పుడు ఎలా ట్యాంక్ చేస్తారని అడిగారు. బతుకమ్మకుంట ఎఫ్టీఎల్కు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారని, వీటిపై అభ్యంతరాలు తీసుకోకుండానే బతుకమ్మకుంటలో చెరువు పనులు ఎలా మొదలుపెడతారని అడిగారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్లో పేర్కొన్న రెండు మ్యాపుల ప్రకారం ఎఫ్టీఎల్, వాటర్స్ప్రెడ్ ఏరియాలను ఖాళీలుగా పెట్టి వాటర్‌లెవల్ బేసిక్ పాయింట్ లేకుండా చూపించిందంటూ, అసలు అక్కడ వాటర్బాడీయే లేనప్పుడు, హద్దులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పురాతనం నుంచి ఇక్కడ చెరువు ఉన్నదని, ఇక్కడ ఈతలు కొట్టామని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పారని, అసలు పురాతనమైన రికార్డు 1352 ఫస్లీ సేత్వార్‌లో ఖుష్కీల్యాండ్ అనే పదం వారికి కనిపించడంలేదా అని అడిగారు. 1987 వరకు ఈ భూమిలో సాగు చేసినట్లుగా ఆధారాలున్నాయని, అప్పటివరకు భూమిశిస్తు కూడా కట్టామని చెప్పారు. రెవెన్యూ రికార్డులు, లింక్ డాక్యుమెంట్ల ప్రకారం ప్రైవేటు పట్టాదారుగానే నమోదైందని, ఎమ్మార్వో కూడా ప్రైవేటు పట్టాదారుకు సంబంధించిన డ్రై ల్యాండ్‌గానే లెటర్ ఇచ్చారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బతుకమ్మ కుంట విషయంలో ఈనెల 7న హైకోర్టు స్టేటస్కో ఇచ్చినా హైడ్రా ఆధ్వర్యంలో కుంట వద్ద పనులు చేస్తూనే ఉన్నదని, రాత్రింబవళ్లు ఈ పనులు జరుగుతున్నాయని ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వాట్సాప్ ద్వారా సమాచారమిచ్చిన స్పందించలేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. హైకోర్టు బతుకమ్మకుంట విషయంలో ఇరు పక్షాలు జూన్ 10వరకు ఎలాంటి పనులు చేయవద్దంటూ స్టేటస్ కో ఇచ్చినా తెల్లవారే ఈనెల 8న హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మకుంటను గుంజుకుంటామన్నారన్నారు. హైడ్రా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండానే బతుకమ్మ కుంటను వాటర్బాడీగా చూపించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలురకాల డ్రామాలు ఆడుతున్నారని, ఇప్పటివరకు మూడు కోర్టుల్లోనూ కేవియట్ వేశారని, అంతగా భయం లేకపోతే తమ దగ్గర ఉన్న ఆధారాలతో పోరాటం చేయవచ్చు కదా అని అడిగారు. స్టేటస్కో ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా పనులు చేస్తున్నదని ఈ విషయంలో సెక్షన్ 12 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద ఈనెల 10వ తేదీన హైడ్రా కమిషనర్‌కు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లోకి రావాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా తనతో మాట్లాడారని, రోహిన్‌రెడ్డి సీఎంతో మాట్లాడించారని, తాను రాను అన్నందుకు బతుకమ్మకుంటను వివాదాస్పదం చేసి రేవంత్‌రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని ఎడ్ల సుధాకర్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కూడా తనను పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేశారని చెప్పారు. తనలాంటి ఉద్యమకారులను బెదిరించినా తాము పార్టీ మారేది లేదని, కేసీఆర్‌ను,గులాబీ జెండాను వదిలేది లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంతకూ రేవంత్‌రెడ్డికి హన్మంతన్న మీద ప్రేమనా లేక సుధాకర్‌రెడ్డి పార్టీ మారాలన్న లక్ష్యమా చెప్పాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బతుకమ్మకుంటలో బతుకమ్మలు ఆడించాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, వి హన్మంతరావు ఇంటిపక్కనే ఉన్న మొయిన్ చెరువులో బతుకమ్మలు ఆడించాలని, చెరువే కాని బతుకమ్మకుంటలో చెరువు ఎలా చేస్తారని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొయిన్ చెరువును రూ. 16కోట్లతో అభివృద్ధి చేశారని, ఇప్పుడంతా అడవిలా మారిపోవడంతో స్థానికులు మొత్తుకుంటున్నారన్నారు. హైడ్రా చెరువుల అభివృద్ధి అంటున్నదని, ఆ లిస్ట్‌లో 60ఎకరాల మొయిన్ చెరువు ఎందుకు లేదని, అక్కడ అభివృద్ధి చేసి బతుకమ్మలు ఆడించవచ్చు కదా అని ప్రశ్నించారు.