సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లోనూ అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరుతున్నది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్ డీసీ (డిప్యూటీ కమిషనర్) బదిలీ అయిన చోటుకు వెళ్లకుండా ప్రభుత్వ స్థాయిలో తన ట్రాన్స్ఫర్ ఆర్డర్‌ను రద్దు చేయించుకొని..తిరిగి అదే పోస్టులో కొనసాగేలా మరో ఉత్తర్వు తెప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు డీసీకి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నీ తానై అండగా నిలిచినట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ అంశం మరువక ముందే తాజాగా టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి సికింద్రాబాద్ జోన్లో పనిచేస్తున్న ఓ ఏసీపీ బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేది లేదంటూ ట్రాన్స్ఫర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. పలువురు ఏసీపీలకు స్థాన చలనం కల్పించగా.. సికింద్రాబాద్ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు బదిలీ అయిన సదరు ఏసీపీ ..ట్రాన్స్ఫర్ అయిన చోటుకు వెళ్లేది లేదంటూ పైరవీ బాట పట్టారు. తన క్లాస్‌మెట్ అని చెప్పుకొంటున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్యేతో కమిషనర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఉద్యోగ విరమణకు కొన్ని నెలలు మాత్రమే ఉందని, సికింద్రాబాద్‌లోనే కొనసాగించాలని ఆ మాజీ ఎమ్మెల్యే ఏసీపీ తరఫున పైరవీ ప్రారంభించారు. అయితే వారం రోజులు గడిచినా.. సదరు ఏసీపీ బదిలీ అయిన చోటుకు వెళ్లకుండా మళ్లీ ఎలాగైనా ఉన్న స్థానంలో కొనసాగేలా యత్నిస్తున్నారు. కమిషనర్ మాత్రం ఒక్కసారి బదిలీ అయ్యాక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు ఏసీపీ చార్మినార్ జోనల్లో పోస్టింగ్ తీసుకుంటారా? లేదా? అన్నది తోటి ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.