ముషీరాబాద్, జూలై 7: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి పాలనను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పార్టీ ఫిరాయింపులకే పరిమితమయ్యారని బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు ఆరోపించారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనను చక్కదిద్దడంలో లేదని మండిపడ్డారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపిస్తున్నాయని, పారిశుధ్య సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. వర్షాలు కురుస్తూ రోగాలు ముసురుతున్న వేళ ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, నగరంలో హత్యలు అధికమయ్యాయని, సీఎంకు పాలనపై పట్టులేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని, నిరుద్యోగులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. పార్టీలు మారే నాయకులతో వచ్చే బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమిలేదని, ప్రజాదరణ కోల్పోయిన వారే కాంగ్రెస్‌లో చేరుతున్నారని, అలాంటి వారితో కాంగ్రెస్ మునిగిపోవడం ఖాయమన్నారు. పార్టీ ఫిరాయింపులు మాని కాంగ్రెస్ పెద్దలు పాలనను గాడిలో పెట్టాలని హితవు ఫలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రజినీకాంత్ గౌడ్, ముప్పిడి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.