హిమాయత్‌నగర్, జూలై15: పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన తాళాలను వెనక్కితీసుకుందని పలువురు బాధితులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంఖాల్-1లో 162మందికి లాటరీ పద్ధతిలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన తాళాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు.
బాధితులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేసి మంఖాల్-1కు 702 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఫేస్-1లో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన తాళాలు సైతం ఇవ్వగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులోని 162 మందిని అనర్హులుగా ప్రకటించి ఇచ్చిన తాళాలను వెనక్కి తీసుకుందన్నారు. వెంటనే తమ ఇండ్లను తమకు తిరిగి కేటాయించాలని బాధితులు డిమాండ్ చేశారు.