సిటీబ్యూరో, మే 20, (నమస్తే తెలంగాణ): మాది ప్రజాపాలనంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాష్ట్రమంతా కోడై కూస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి బీఆర్ఎస్ ఇచ్చిన జీవోనే తమ జీవోగా చెప్పుకుంటూ రేవంత్ సర్కార్ నమ్మబలుకుతుంది. అప్‌గ్రేడ్ చేసిన అనంతరం ఏడాది వేతనం ఇవ్వకుండా అంగన్వాడీ టీచర్లను ముప్ప తిప్పలు పెడుతుంది. గ్రేటర్‌లోని 236 అప్‌గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు ఏడాదికాలంగా వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు.
టీచర్లుగా గుర్తించింది కేసీఆరే..
మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో నివసించే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాలు అందించేందుకు 2007లో మినీ అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. వాటిలో భాగంగా ఆ ప్రాంతా ల్లో అర్హత కలిగినవారు తన పరిధిలో ఉన్న బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పోషకాలు అందించేవారు. ఈ విధంగా చేస్తున్న తరుణంలో 2010 నుంచి ఎలాంటి జీవోలు లేకుండానే వాటిని మెయిన్ సెంటర్లుగా ప్రకటిస్తూ అన్నిరకాల పనులు వారితో చేయించడం మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా కేవలం హెల్పర్‌ను నియమించకుండానే ఉన్న ఒక్క సిబ్బందితోనే పనిచేయించుకుంటూ వేతనం మాత్రం మినీ సెంటర్లో మాదిరే, ఏ మాత్రం పెంచకుండా ఇవ్వడం గమనార్హం. కేసీఆర్ అధికారంలోకి రాగానే మినీసెంటర్లలో పనిచేస్తున్నవారందరిని హెల్పర్లకు బదులు అంగన్వాడీ కేంద్రాల టీచర్లుగా పిలవాలని ఆదేశాలు జారీచేశారు. వారివేతనాలు సైతం పెంచాలనే లక్ష్యంతో మినీలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు జీవో తెచ్చారు. ఎన్నికల కోడ్ కారణంగా అమలు చేసేందుకు ఆస్కా రం లేకుండా పోయింది.
ఆ జీవో మూడు నెలల ముచ్చటే..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేతనాలు పెంచి ఒక్కో అంగన్వాడీ టీచర్‌కు ప్రతినెలా రూ.13,650 వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. 2024 జనవరి నుంచి అమలులోకి వచ్చినా ఈ జీవో ముచ్చటగా మూడు నెలలు మాత్రమే అమలు చేశారు. పెంచిన వేతనం ఇవ్వకుండా నెలకు రూ.7800 ఇస్తూ చేతులు దులుపుకున్నారు. అదేంటని అడిగిన మినీ అంగన్వాడీలకు సంబంధంలేని సమాధానాలు చెప్పుకుంటూ మోసగించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12నెలలుగా పెంచిన వేతనాలు ఇవ్వకుండా, పాత వేతనాలను ఇస్తూ మినీ అంగన్వాడీల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నేటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 సెంటర్లలో హెల్పర్లు లేక వారి పనికూడా టీచర్లే చేస్తుండటం గమనార్హం.
ఇబ్బందులు పడుతున్నాం..
తక్కువ వేతనానికి హెల్పర్ల పని కూడా మేమే చేస్తున్నాం. పెంచిన వేతనం ఏడాదికాలంగా పెండింగ్‌లోనే ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. పేరుకు అప్‌గ్రేడ్ కేంద్రాలు, జీతం మాత్రం మినీ సెంటర్ల ప్రకారం ఇస్తున్నారు. కచ్చితంగా పెండింగ్ వేతనాలు విడుదల చేసి, హెల్పర్లను నియమించాలి. మాకు సరైన గుర్తింపునివ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతూనే మరోవైపు ప్రభుత్వ పథకాలకు మేము అర్హులు కామని చెబుతారు.
– వరలక్ష్మి, రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు