MLA Maganti Gopinath | వెంగళరావునగర్, ఆగస్టు 28 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్‌ను విస్మరిస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇవ్వడంపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బుధవారం శ్రీనగర్ కాలనీ డివిజన్ నవోదయ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులను పంపిణీ చేసేవారమన్నారు. డివిజన్ల వారీగా సభలు పెట్టి లబ్ధిదారులకు చెక్కులతో పాటు బహుమతులనూ ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ చెక్కులను ఆయా ఎమ్మార్వో కార్యాలయాల్లోనే ఇవ్వాలని జిల్లా ఇన్చార్చి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినట్లు అధికారులు అంటున్నారన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పెద్దదైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, బాలానగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, షేక్‌పేట్ మండలాలు ఉన్నాయన్నారు.
పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే రవాణా ఖర్చులవుతాయన్నారు. ఖైరతాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు ప్రజలు తన దృష్టికి తెచ్చారని, అవినీతికి తావులేకుండా గతంలోనే మాదిరిగానే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ తదితరులు పాల్గొన్నారు.