Future City | రంగారెడ్డి, మార్చి 27 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యా లయాన్ని నానక్‌రాంగూడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోగల నానక్‌రాంగూడలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసి అక్కడినుంచి ఫ్యూచర్‌సిటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం కూడా నానక్‌రాంగూడలోనే ఉండటం వలన ఈ కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటుచేస్తే బాగుంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే ఫ్యూచర్‌సిటి డెవలప్మెంట్ అథారిటీ సీఎంఓకు సమీపంలో ఉండాలన్న నిర్ణయం మేరకే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోనే నానక్‌రాంగూడ ఉండటం వలన అక్కడినుంచి ఓఆర్ఆర్ మీదుగా ఫ్యూచర్‌సిటీకి చేరుకోవటానికి సులభంగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది. నానక్‌రాంగూడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుచేసి ఫ్యూచర్‌సిటి పూర్తిస్థాయి నిర్మాణం జరిగిన తర్వాత కార్యాలయాన్ని ఫ్యూచర్సిటికి మార్చే అవకాశాలున్నాయి.
ఫ్యూచర్సిటీకోసం ఇప్పటికే ప్రభుత్వం 36పోస్టులను కేటాయించింది. 36పోస్టుల్లో ఒక ఐఏఎస్ అధికారితో పాటు మరికొంతమంది గ్రూప్-1 అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో పాటు సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు కూడా ఉండనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో అధికారులను భర్తీ చేయటం కోసం జిల్లాలోని సీనియారిటీ ప్రతిపాదికన అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఫ్యూచర్‌సిటి పరిధిలోకి వచ్చే ఏడు మండలాల్లో ఉన్న అధికారులతో పాటు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులను ఈ పోస్టుల్లో భర్తీచేసే అవకాశాలున్నాయి.