సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘కారు’ జోరు పెంచింది. నియోజకవర్గాన్ని బీఆర్ఎస్కు కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ రాబోయే ఉప ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసి మరోసారి సత్తా చాటేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేతగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్‌కే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్థిగా పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడుతుంటే జనాల్లో చెక్కు చెదరని ఆదరణతో ఉన్న గులాబీ పార్టీ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు పార్టీ అభ్యర్థి అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారిలో భరోసా కల్పిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ముమ్మరం చేసింది. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్‌తో ఉండగా, మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల కిందట షేక్‌పేట డివిజన్లో పర్యటించి అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఇంటింటికీ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
మరో వైపు కలిసివచ్చే ఇతర పార్టీల నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సోమవారం టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇదే బాటలో జాతీయ పార్టీల నుంచి మరికొంత మంది బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాగంటి సునీతా గోపీనాథ్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీతాగోపీనాథ్ను గెలిపించుకొని గోపీనాథ్‌కు అసలైన నివాళి అర్పించాలని ఆయన అభిమానులు, శ్రేణులు భావిస్తున్నారు.
ఈ తరుణంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనలను అనుగుణంగా సునీతాగోపీనాథ్ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులతో మాట్లాడి భారీ మెజార్టీ లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు.