Medchal | జవహర్‌నగర్, ఫిబ్రవరి 11 : పేదల ఇళ్ళపై… కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్‌నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం… కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాలాంటి పేదలనే టార్గెట్ చేస్తుంది. సారూ… మాకు సమయం ఇవ్వండి… ఖాళీ చేస్తామంటూ అధికారులను వేడుకున్న తమకు పట్టనట్టు కర్కశంగా ప్రవర్తించారు. గుడిసెలోని వస్తువులను సిబ్బందితో బయటకు తీయించి.. రోడ్డునా పడేసి దిక్కులేని వారిని చేసిందంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని పలు అక్రమ కట్టడాలను మంగళవారం రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పోలీస్ ప్రొటక్షన్ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని దేవేందర్‌నగర్‌లో గుడిసెలు వేసుకుని ఏళ్ళ నుంచి జీవనం సాగిస్తున్న వారిపైకి బుల్డోజర్ను పంపి.. పోలీసు బందోబస్తు మధ్య వారి నివాసాలను నేలమట్టం చేశారు. గుడిసెల్లో నివసించే పేదలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ఇంట్లోని వస్తువులు రోడ్డుపాలు చేశారు.
ఒకే ఇంటిని ఐదు సార్లు కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. మేమేం పాపం చేశాం.. మా ఇంటిని ఐదు సార్లు కూలగొట్టడం ఏంటని బాధితులు బోరున విలపించారు. రెవెన్యూ యంత్రంగా మా ఇంటిపై పగబెట్టుంకుంది… జవహర్‌నగర్‌లో నివసించేది పేదలేనని… ఇక్కడున్న వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నివాసాలకు కరెంట్ మీటర్, ఇంటి పన్ను కడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
జవహర్‌నగర్‌లో గరీబోళ్ళే బతుకుతారని… కాంగ్రెస్ వస్తే మాలాంటి పేదల బతుకులు మారుతాయని ఆశపడ్డాం… కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి మాలాంటి పేదల బతుకుల్లో మట్టిని కొడతారని ఊహించలేదని పేదలు కన్నీరు పెట్టుకున్నారు. పేదలపై ప్రతాపం చూపిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని శాపనార్థాలు పెట్టారు.
పేదలకో న్యాయం… పెద్దలకో న్యాయంలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని… పలుకుబడి ఉన్నోళ్ళు బహుళ అంతస్తులు కడుతున్న వారి ఇళ్ళను కూల్చకపోవడంలో అంతర్యమేమిటంటూ పేదలు ప్రశ్నలు సంధిస్తున్నారు. పేదల గుడిసెలను బుల్డొజర్తో కూలగొడుతున్నారు… కానీ పలుకుబడి ఉన్నొళ్ళ అక్రమ కట్టడాల వద్ద హంగామా చేస్తూ అధికారులు కాలం వెళ్ళదీశారే తప్పితే పెద్దొళ్ళ ఇళ్ళను ముట్టుకోలేదంటూ.. ఇదెక్కడి న్యాయం అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ సీఐ సైదయ్య, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీరేంద్రసాయి, రమేష్, టీపీవో శ్రవంతి, రెవెన్యూ సిబ్బంది రవి, సాయి, కాశీరాం, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.