రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84/పీలో ఉన్న 8.15 ఎకరాల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని భూముల్ని నివాసయోగ్య భూములుగా మార్చేందుకు అభ్యంతరాలు కోరుతూ హెచ్ఎండీఏ ఈ ఏడాది జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో గోపి చెరువు ఉంది. నిక్షేపంగా ఉన్న చెరువులో ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు బడా కంపెనీ ఒకటి ప్రణాళిక రూపొందిస్తే..అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూ వినియోగాన్ని మార్చేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రభుత్వ పెద్దల మాటలకు అర్థాలే వేరులే.. అన్నట్లు.. ఏడాదిన్నరగా చెరువులు..ప్రభుత్వ భూముల పరిరక్షణ అనే రేవంత్ సర్కారు సంకల్పానికి.. సామాన్యుడే సమిధిగా మారుతున్నాడు. నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటే స్కెచ్ వేసి.. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున విరుచుకుపడే అధికార యంత్రాంగం.. బడాబాబుల విషయానికి వచ్చే సరికి ‘హైడ్రా’మాలాడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి గ్రేటర్ పరిధిలో ఎక్కడ సమావేశాల్లో ప్రసంగించినా.. సర్కారు భూముల్ని ఆక్రమిస్తే, వాళ్లు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరికలు చేయడం ఆనవాయితీగా మారింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. చెప్పేదొకటి.. చేసేది మరొటిలా.. చెరువులను పరిరక్షిస్తామంటూ.. హైడ్రాతో హల్చల్ చేస్తూనే.. పెద్దోళ్ల కోసం సర్కారు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తుండటం కొసమెరుపు.
-హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 15 (నమస్తే తెలంగాణ):
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్ల గ్రామ పరిధిలోని 381/పీ సర్వే నంబరులో దాదాపు ఐదెకరాలకు పైగా భూమిని నివాస (రెసిడెన్షియల్) జోన్లోకి మార్చేందుకు ఇదే ఏడాది ఫిబ్రవరి 27న హెచ్ఎండీఏ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో దాదాపు 700 చదరపు గజాలకు పైగా స్థలం బఫర్‌జోన్‌లో ఉంది. అంటే చెరువు పరిధిలో ఉందన్నమాట. పనిలో పనిగా ఈ స్థలాన్ని కూడా నిర్మాణాలు కట్టేందుకు అనువుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడా బడా బాబులే దరఖాస్తు చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మండలం మైసమ్మగూడ గ్రామ పరిధిలో ఉన్న 517/పీ, 518/పీ సర్వే నంబర్లోని సుమారు రెండు ఎకరాల భూమిని కూడా నివాస జోన్లోకి మార్చేందుకు ఈ ఏడాది జనవరి 10న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో అత్యధిక భాగం బఫర్‌జోన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చెరువులోని భాగమన్న మాట. ఈ రెండెకరాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు అడ్డుగా ఈ బఫర్‌జోన్ ఉండటంతో దానిని కూడా నివాస జోన్లోకి మార్చేందుకు దరఖాస్తు చేసుకుంటే అధికార యంత్రాంగం మార్గం సుగమం చేసే పనిలో ఉంది.
చెరువులను చెరబడితే చెరసాలనే… అన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెరువుల పట్ల అవలంబిస్తున్న తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎవరో బడా బాబులు, కార్పొరేట్ సంస్థలు గతంలో చెరువుల్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను సామాన్యుడు కొనుగోలు చేస్తే హైడ్రా పేరుతో వాటిని కూల్చివేశారు. మరి… ప్రభుత్వమే చెరువులను కనుమరుగు చేసేలా ఇలా నోటిఫికేషన్లు జారీ చేసి.. నీటి వనరుల స్థానంలో కాంక్రీట్ జంగిల్‌ను తయారు చేస్తే ఎవరిని అడగాలి? సామాన్యుడిపై బుల్డోజర్లను పంపిన ఈ సర్కారు.. బడా బాబుల దరఖాస్తులకు మాత్రం ఎర తివాచీ పరచడాన్ని ఏమనాలి?? ప్రభుత్వ భూముల్లో బడా బాబులు వేస్తున్న పాగా, అందుకు అధికార యంత్రాంగమే సహకరిస్తున్న తీరుపై మచ్చుకు రెండు ఉదాహరణలు ఇవిగో.. బంజారాహిల్స్ ఉన్న సుమారు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం.. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నంబర్ 111, బ్లాక్- హెచ్, వార్డు-10లో ఎకరంన్నర భూమిని జలమండలికి కేటాయించగా.. అందులో ఒక రిజర్వాయర్ నిర్మించారు. దానిని ఆనుకొని మరో 3.20 ఎకరాల ఖాళీ స్థలం ఉంది.
రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఖాళీ స్థలంపై ఒక ప్రైవేటు వ్యక్తి కన్నుపడింది. ఆర్నెల్లుగా అందులో తిష్ట వేయడం.. ‘నమస్తే’ కథనం ప్రచురించగానే అధికారులు అతడిని ఖాళీ చేయించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ బోర్డును తరచూ అతను తొలగించి ఇది తనదేనంటూ అమ్మకానికి పెడతారు. ఆ తంతు ముగియగానే అధికారులు మళ్లీ మరో బోర్డును ఏర్పాటు చేస్తారు. ఐదారు నెలలుగా ఇదో పిల్లలాటగా తయారైంది. సామాన్యుడు గజం భూమి ఆక్రమిస్తే బుల్డోజర్లు, పోలీసులతో హంగామా సృష్టించడమనేది గత ఏడాదిన్నరగా నిత్యకృత్యమైంది. కానీ ఇక్కడ ఆర్నెల్లుగా ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తి బోర్డులు తొలగించినా, తానే సొంతంగా సీసీ కెమెరా ఏర్పాటు చేసినా, కుక్కలతో పహారా పెట్టినా అడిగే అధికారి లేరు. తెర వెనక పెద్దల హస్తం లేనిదే అతడు ఇంత దర్జా ఒలకబోస్తాడా.
రూ.250 కోట్ల విలువైన మరో సర్కారు భూమి కథ. హిమాయత్‌సాగర్ బఫర్‌జోన్‌ను కలుపుకొని 52 ఎకరాల్లో విస్తరించి ఉంది. రంగారెడ్ది జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్ 54లో 270.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ప్రభుత్వ, ప్రజా అవసరాలకుపోను 52 ఎకరాల భూమి మిగిలింది. దానిని కొందరు బడా బాబులు తమవేనంటూ స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ వివాదం నలిగి… చివరకు 2018లో రంగారెడ్డి జిల్లా కోర్టులో 20 వరకు దావాలు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా వాదించడంతో ఎట్టకేలకు కోర్టు గతేడాది డిసెంబరులో 52 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తేల్చింది. ఉత్తర్వులు రెవెన్యూ అధికారులకు చేరాయి.
కానీ ఇప్పటిదాకా భూమి సర్కారు ఆధీనంలోకి రాలేదు. ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ఇచ్చింది. తెర వెనక పెద్దల ఒత్తిడితో ప్రభుత్వ అధికారులే సదరు ప్రైవేటు వ్యక్తులకు స్టే తెచ్చుకోవాలనే సలహా ఇచ్చి… అందుకు సమయం కూడా ఇస్తున్నారని పేర్కొన్నది. కేవలం ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేసి… అదిగో..స్వాధీనం చేసుంటామంటూ ఐదు నెలలు నెట్టుకొచ్చిన అధికారులు.. సదరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు కదా! అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోనే ఉంటుందని పరోక్షంగా తేల్చి చెప్పారు.