హైదరాబాద్, జూన్ 11 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో ముందు నిలుపడంతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎదిగింది. కానీ రేవంత్ సర్కార్ అస్తవ్యస్త విధానాలతో విషనగరంగా దిగజారింది..’ అంటూ బీఆర్ఎస్ అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ధ్వజమెత్తారు. పనులు చేసింది బీఆర్ఎస్ అయితే ప్రచారం మాత్రం కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఎల్బీనగర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలవుతున్నా నగరంలో చేసిన పనులేంటో చెప్పుకోలేక, భవిష్యత్‌లో ఏం చేస్తారో చెప్పలేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బురదజల్లుతూ కాలంవెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హాయాంలో రాష్ట్రానికి అన్నంపెట్టిన హైదరాబాద్ పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి కనీసం చెత్తకూడా తరలించలేని దుస్థితిలో చిక్కుకున్నారని, కానీ పొద్దునలేస్తే చెత్త మాటలతో బీఆర్ఎస్ నేతలపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధ్వంసం పేరిట రాక్షసానందం..
పదేళ్ల కేసీఆర్ పాలనలో పారిశుధ్యం, మోస్ట్ లీవెబుల్ సిటీగా అనేక జాతీయ, అంతర్జా తీయ అవార్డులు గెలుచుకున్నదని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి హైడ్రా పేరిట విధ్వం సం సాగిస్తూ ఇరాన్ యుద్ధంతో పొల్చుతూ, తనకు తాను హిట్లర్‌ను అని చెప్పుకొంటూ రాక్షసానందం పొందుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను గాలికొదిలి ఫ్యూచర్‌సిటీ ముసుగులో రియల్ ఎస్టేట్ డ్రామాలకు తెరలేపారని దుయ్య బట్టారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సేకరించిన 14 వేల ఎకరాలను తిరిగి ఇస్తానని ఓట్ల ముందర గొప్పలు చెప్పిన ఆయన గద్దెనెక్కగానే మాటమార్చి ప్రజలను ఏమారుస్తున్నా రని మండిపడ్డారు. మిడిమిడి జ్ఞానంతో ఫ్యూచర్‌సిటీని న్యూయార్క్, సింగాపూర్, టోక్యో చేస్తానని గప్పాలు కొడుతున్నారన్నారు. ఫ్యూచర్‌సిటీ భ్రమ మాత్రమేనని అక్కడా కనీసం గుడి, బడి, మనుషులు కూడా లేరని స్పష్టం చేశారు. నగరవాసుల బతుకులతో చెలగాటమాడుతున్నారని.. బీఆర్ఎస్ రేవంత్‌రెడ్డి చీకటి దందాలను బట్టబయలు చేస్తుందని హెచ్చరించారు.
1.40 కోట్ల జనాభా కలిగి విశాలమైన హైదరాబాద్‌ను వదిలివేసి ఫ్యూచర్‌లేని సిటీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆరాటపడడం దుర్మార్గమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్ల కోసం ఇక్కడ ప్రజలు అల్లాడుతుంటే ఆయన మాత్రం ఫ్యూచర్‌సిటీ కలల్లో తేలియాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 700 ఎంజీడీల నీరు అవసరముండగా కేవలం 500 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కండ్లు తెరిచి కాలనీలన్నింటికీ నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ వాసులను రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న భూములను అమ్మడం తప్పా ఉద్ధరిం చిందేంటని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయాంలోనే నాలాలు, ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు నిర్మించామని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట కాలయాపన చేయడం తప్పితే చేసిందేమీలేదన్నారు. కేసీఆర్ కట్టిన డబుల్బెడ్రూంలను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టాను సారంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.