Congress Govt | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్‌ను కాంగ్రెస్ సర్కార్ పక్కకుపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన లక్ష డబుల్ బెడ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయగా ఇంకా దాదాపు 32 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నగరం నలుమూలలా ఉన్నాయి. వాటిని తమకు పంపిణీ చేయాలని పేద ప్రజలు కోరుతున్నారు. వాటిని పంచితే క్రెడిట్ అంతా కేసీఆర్‌కే వస్తుందనే అక్కసుతో నిరుపయోగంగా ఉంచుతూ నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన చెంతున్నారు. నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉండగా.. ఎందుకు పంచడం లేదని నిలదీస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలు ధీమాగా బతకాలనే దృఢ సంకల్పంతో వందలాది కోట్ల రూపాయల విలువైన ప్రాంతాల్లో సకల సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. హైదరాబాద్ విశ్వ నగరంగా విస్తరిస్తుండటంతో శివారు ప్రాంతాల్లోని భూముల ధరలు కోట్లలోకి చేరాయి. ఆ ప్రాంతాల్లోనే నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ భావించింది. అందుకనుగుణంగా నగరం నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. వాటిలో దాదాపు 68 వేల ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంకా సుమారు 32 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉంచారు. కానీ వాటిని కాంగ్రెస్ సర్కార్ నిరుపయోగంగా ఉంచుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చి.. కోట్ల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పక్కకు పెట్టిందని నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శంకుస్థాపనలతో కాలయాపన చేసే బదులు సిద్ధంగా ఉన్న ఇండ్లను పంచితే నిరుపేదలకు ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. నగరంలో నివసించే పేదలకు సొంత స్థలం ఉండదనే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం సొంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతున్నది. సొంత స్థలం ఉంటే పేదలమెలా అవుతామని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల పేరిట మోసం చేయకుండా సిద్ధంగా ఉన్న ఇండ్లను పంచాలని కోరుతున్నారు. నగర ప్రజలను దరఖాస్తుల పేరిట ఇబ్బందులకు గురిచేయకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇప్పటికే ఎంపికైన వారికి పంపిణీ చేసి.. మిగిలిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.