Ration Cards | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ దరఖాస్తులతో కాలయాపన చేస్తున్నది. ఏడాది నుంచి ఇప్పటి దాకా అర్హులు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, గ్రామ-వార్డు సభలు, ప్రజావాణి, మీసేవలో అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రేషన్ కార్డుల జారీపై ప్రకటనలకే పరిమితమైంది. ఎవరికి ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారో సరైన మార్గదర్శకాలు జారీ చేయలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది, పౌర సరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. కానీ.. ఏ ప్రాతిపదికన రేషన్ కార్డులిస్తారు? అర్హులు ఎవరు? అర్హతగా దేన్ని ఆధారంగా చేసుకుంటారని అడిగితే తమకు తెలియదని, సర్వే చేయడం వరకే తమ బాధ్యతని చెబుతున్నట్లు అర్జీదారులు అంటున్నారు. తమకు రేషన్ కార్డు వస్తుందా? లేదా? అనే అయోమయంలో ఉన్నామనవి వాపోతున్నారు.
రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడం, దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించడం తప్ప.. సరైన మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేదు. అర్హులకు ఏ ప్రాతిపదికన కార్డు ఇస్తారో అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులుకు స్పష్టత లేకుండా పోయింది. మరికొద్ది రోజుల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సీఎం ఒక అడుగు ముందుకేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలో సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రేషన్ కార్డు వస్తుందో లేదోననే అయోమయంలో దరఖాస్తుదారులున్నారు. ఏడాదిలోనే నాలుగుసార్లు దరఖాస్తు చేసుకోమనడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారు. దరఖాస్తు చేసుకోమంటున్నారు కానీ ఇస్తరో ఇవ్వరో అనే నిరాశలో ఉన్నట్లు తెలుస్తున్నది. తమ రేషన్ కార్డు స్టేటస్ ఏంటని తెలుసుకునేందుకు నిత్యం మీసేవలో వాకబు చేస్తున్నారు. సర్వేకొచ్చిన అధికారులను అడిగితే తమకు తెలియదనడంతో ఎవరిని అడగాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. అన్ని అర్హతలున్నా రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేకపోతున్నామని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమానాలను తొలగించి త్వరితగతిన రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
గతంలో అప్లికేషన్ చేసుకున్నవారు మరోసారి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే వివిధ సమస్యలు వెలుగు చూస్తున్నట్లు అర్హులు చెబుతున్నారు. ఎక్కువ దరఖాస్తుల్లో పెండింగ్, అలాటెడ్, అప్రూవ్డ్, అని చూపుతున్నట్లు మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. వారందరికీ కొత్త కార్డులు వస్తాయో రావోననే అమోమయంలో ఉన్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. మీసేవ సైట్లో ఏ స్టేటస్‌లో ఉంటే రేషన్‌కార్డు వస్తుందో ప్రభుత్వం తెలపాలని కోరుతున్నారు. ‘పెండింగ్’ అని వచ్చిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలో లేదో చెప్పాలని అంటున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేదాకా ప్రజల్లో గందరగోళం తొలగే పరిస్థితి లేదు. సమస్యలన్నింటినీ తొలగించి తమ ఇబ్బందులకు స్వస్తి పలకాలని కోరుతున్నారు.