మేడ్చల్, జూన్15(నమస్తే తెలంగాణ): ప్రైవేట్ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చడంపై బిల్డర్లు, స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక సర్వే నంబర్లోని కొంత విస్త్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే మొత్తం భూ విస్తీర్ణం 22-ఏలో చేర్చడం ఏమిటని పట్టాదారులు, రియల్టర్లు, బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. నిషేధిత జాబితాను సవరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు సోమవారం తరలివచ్చారు.
ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రర్ల పరిధిలో ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు నిలిపివేసిన విషయం విధితమే. దీంతో ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఉప్పల్ బిల్డర్ అసోషియేషన్ అధ్యక్షుడు సత్యనారయణ ఆధ్యరంలో స్థానికుల, బిల్డర్లు, రియల్టర్లు, బయ్యర్లు సర్వేనంబర్ల వివరాలను కలెక్టర్ మను చౌదరికి అందజేసి పరిష్కరించాలని కోరారు. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో వివిధ సర్వే నంబర్లను వక్ఫ్ బోర్డు జాబితాలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీర్జాదిగూడ పరిధిలోని 46 సర్వే నెంబర్, సాలార్జంగ్లోని సర్వే నెంబర్లు 10, 11, పర్వతాపూర్‌లోని 16, 17, 26, 27, 28, 29 మేడిపల్లిలోని సర్వే నంబర్ 42, 44, 45, 46 పోచారంలో సర్వే నంబర్ 50 చెంగిచెర్లలో సర్వే నంబర్లు 33బై 4, 33బై 5, 33బై6, 33బై 7, 33బై38, 33బై9, 33బై 10లో నిషేదిత జాబితాలో చేర్చారు. ఉదాహరణకు పీర్జాదిగూడలోని 46 సర్వే నంబర్లో మొత్తం భూమి లే అవుట్లుగా మార్చడం జరిగింది. ఇందులో గజం భూమి కూడా వ్యవసాయ భూమి లేదు. అయినప్పటికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 31 చదరపు గజాల భూమి నిషేధిత జాబితాలో చూయిస్తుంది.
దాదాపుగా 400 ప్లాట్లు రిజిస్ట్రేషన్ జాబితాలో చూపిస్తున్నాయి. ఫలితంగా ప్లాట్ల యజమానులు భయాందోళనలు చెందుతున్నారు. క్రయ విక్రయదారులు తమ తమ ఆస్తులను రిజిస్ట్రార్ తాకట్టు బదిలీ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉదాహరణలే సాలర్జంగ్, పర్వాతపూర్, మేడిపల్లిలో ఉండగా పోచారం రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 50లో మొత్తం 244 ఎకరాల విస్తీర్ణంలో 102. 01 ఎకరాల భూమి మాత్రమే హౌసింగ్ బోర్డుకు చెందింది కాగా మిగిలిన భూమి ఇప్పటికే నివాస లే అవుట్లుగా అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ మొత్తం సర్వేనంబర్‌ను హౌసింగ్ బోర్డు భూమిగా నమోదు చేసి నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చారు. బోడుప్పల్ పరిధిలోని సర్వే నంబర్లు వక్ఫ్ బోర్డు జాబితాలో చేర్చారు.
చెంగిచెర్ల రెవెన్యూ గ్రామంలో 33బై 2, 33బై3, 33బై 4, 33బై 5, 33బై 6, 33బై 7 ఈ సర్వే నెంబర్లు అనేవి ప్రైవేట్ పట్టా భూములు ఉన్నాయి. నిషేధిత జాబితాలో 33బై1, 33బై11, 33బై 12 సర్వే నెంబర్లు మాత్రమే ఉండగా పట్టా భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానికుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిజమైన భూ యజమానులు, ప్లాట్ కొనుగోలుదారులు, బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘట్కేసర్, నారపల్లి, ఉప్పల్, సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో చేరిన పైవేట్ భూములను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.