రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్‌లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద్రనగర్, నాంపల్లి వంటి ఏఎస్వో కార్యాలయాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నదని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
దళారులు అక్కడే తిష్ట వేసి రేషన్ కార్డు కోసం వచ్చినవారి నుంచి బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. వసూలు చేసిన డబ్బును దళారులు, ఏఎస్వో సిబ్బంది వాటాల రూపంలో పంచుకుంటున్నట్లు సమాచారం. డబ్బులిస్తే ఒక్కరోజులోనే రేషన్ కార్డు చేతికిస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రాంతాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.పది వేల దాకా సమర్పించుకుంటున్నారు.
సిటీ బ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబ్బులివ్వకుంటే రేషన్ కార్డులు అందని దుస్థితి నెలకొంది. అర్హులందరికీ సకాలంలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ పాలకులు రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది రేషన్ కార్డులు పంపిణీ చేశామని అంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో రేషన్ కార్డు రావాలంటే పౌర సరఫరాల సిబ్బంది, మధ్య దళారుల చేతులు తడపాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అసిస్టెంట్ సప్లయి కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని దరఖాస్తు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వకుండా రేషన్ కార్డులు ఇవ్వడంలేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు ఇవ్వనిదే ఏ పని కాదని అధికారులు, దళారులు నిరూపిస్తున్నారని మండిపడుతున్నారు.
దళారులు ఏఎస్వో కార్యాలయాల ముందే కూర్చొని అర్హుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు కావొస్తున్నా రేషన్ కార్డు రాకపోవడంతో బాధితులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. స్టేటస్‌లో పెండింగ్, పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్, ప్రాసెసింగ్ అని చూపిస్తుండటంతో ఏఎస్వో కార్యాలయాలకు వెళుతున్నారు. కార్యాలయాల్లోనే ఉంటున్న దళారులు తాము అధికారులకు చెబితేనే పని తొందరగా అవుతుందని బహిరంగంగానే చెబుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని రూరల్ ప్రాంతాలైతే రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. నగరం లోపలి ప్రాంతాల వారికైతే రూ.5 వేల నుంచి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, దినసరి కూలీ పనులు చేసుకునేవారు కార్యాలయం చుట్టూ తిరగలేక, అధికారులను అడిగే పరిస్థితి లేకపోవడంతో అడిగినంతా ఇస్తున్నారని నిట్టూరుస్తున్నారు. అలా డబ్బులు వసూలు చేసిన వారి పేర్లను ఏఎస్వో లోని సిబ్బందికి ఇవ్వడంతో వారు అప్పటికప్పుడు వివరాలను నమోదు చేసి ఒకటి, రెండు రోజుల్లోనే రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని తెలుస్తున్నది.
ఏఎస్వో కార్యాలయాల వద్ద దళారులకు డబ్బులిస్తే రేషన్ కార్డులు వెంటనే వస్తున్నాయనే ప్రచారం గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నది. ఆయా కాలనీల్లో పక్క వాళ్లకు రేషన్ కార్డు వచ్చి తమకు రాకపోవడంతో దరఖాస్తుదారులు ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగడమెందుకని డబ్బులిచ్చి తీసుకున్నామని బాధితులు చెబుతున్నారు. ఏకంగా దళారుల ఫోన్ నెంబర్లు కూడా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
దీంతో డబ్బులు పోయినా వ్యవ ప్రయాసలు తగ్గుతాయని దళారులను ఆశ్రయిస్తున్నామని దరఖాస్తుదారులు వాపోతున్నారు. మరోవైపు దరఖాస్తు దారులు మీసేవ కేంద్రాలకు వెళుతుండటంతో ఏఎస్వో కార్యాలయాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళితే అసలు విషయం తెలుస్తున్నదని అర్హులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసే బదులు ఎంతో కొంత డబ్బు ఇస్తే వెంటనే కార్డు వస్తుందని దరఖాస్తుదారులే ప్రచారం చేస్తున్నారు. దళారులే తమ వద్దకు వచ్చినవారితో ఇంకెవరైనా ఉంటే చెప్పాలని, వారికి కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తామని బహిరంగంగా చెబుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
మాది హయత్ నగర్. నేను ప్రజాపాలనతో పాటు మీసేవలో కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా. మీసేవలో ఎన్నిసార్లు స్టేటస్ చేసినా పెండింగ్ అని వస్తుంది. నిర్వాహకులను అడిగితే రాజేంద్రనగర్ ఏఎస్వో కార్యాలయానికి వెళ్లి అధికారులను అడగాలన్నారు. అక్కడికెళ్లి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పెండింగ్ వస్తుందన్నాను. బయటకు వచ్చాక ఆ పరిసరాల్లో ఉన్న కొంతమంది వివరాలు చెప్పి రూ.5 వేలిస్తే రేషన్ కార్డు ఇప్పిస్తామన్నారు. వారిని బతిలాడి రూ.3 వేలిచ్చాను. రెండు రోజుల్లో రేషన్ కార్డు వచ్చింది.
-రేషన్ కార్డుదారుడు, హయత్ నగర్