సిటీ బ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించింది. అన్ని ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే కాలుష్య నియంత్రణ మండలి ప్రజా సంక్షేమానికి ముఖ్యమైనది. బోర్డు నిర్వహణ, బాధ్యతలు అత్యంత కీలకం కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి కాలుష్య నియంత్రణ మండలిని పట్టించుకునే వారే కరువయ్యారు. పీసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు.
పీసీబీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఆ శాఖ బాధ్యతలు మంత్రి కొండా సురేఖ నిర్వర్తిస్తున్నారు. అయితే రెండేండ్లలో పీసీబీపై ఆమె ఏమాత్రం పట్టుసాధించలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మంత్రికి అవగాహన లేకపోవడం, చైర్మన్ గాలికొదిలేయడంతో పీసీబీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రామకృష్ణారావు కనీసం ఒక్కసారి కూడా బోర్డు మీటింగ్ నిర్వహించలేదని తెలుస్తున్నది. అసలు ఆ సంస్థకు తాను చైర్మన్ అని రామృకృష్ణారావు, పర్యావరణ మంత్రి కొండా సురేఖ మర్చిపోయినట్లున్నారని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పర్యావరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో 2023 డిసెంబర్ 17న మంత్రి సురేఖ కాలుష్య నియంత్రణ మండలి సందర్శించారు.
ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి విజిట్ చేసి మమా అనిపించారు. అప్పటి నుంచి కాలుష్య నియంత్రణ మండలిలో ఆమె అడుగే పెట్టలేదు. మంత్రి, చైర్మన్ పట్టించుకోకపోవడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విధులకు వస్తున్నాం.. పోతున్నామనే తీరుగా పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిత్యం పరిశ్రమలు, చెరువులు, నాలాల్లోనివ్యర్థాలను కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. వ్యర్థాల శాంపిళ్లను సేకరించి కాలుష్య కారకాల వివరాలు, తీవ్రతను బట్టి చర్యలు తీసుకోవాలి.
శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తూ.. కాలుష్య కారకాల వివరాలు, తీవ్రతను నమోదు చేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఎక్కడా చర్యలు తీసుకున్నట్లుగానీ, పర్యావరణానికి భంగం కలిగిస్తున్న పరిశ్రమలను సీజ్ చేయడం కానీ జరగడం లేదు. పీసీబీకి చెందిన టాస్క్ఫోర్స్ కమిటీ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వారు తనిఖీలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. వాటిలో ఎలాంటి జీవరాశులు నివసించలేకుండా తయారయ్యాయి.
సీసం, కాడ్మియం, నికెల్ వంటి రసాయనాలు ప్రమాదకరంగా ఉన్నాయని పలుసార్లు చేసిన పరీక్షల్లో తేలింది. వాటి పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిరంతర తనిఖీలు, చర్యల్లో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నిస్తే.. సరైన సిబ్బంది లేదని, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలు సహకరించడంలేదని దాటవేస్తున్నారు. అయితే పీసీబీలో నిధులు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మండలిలో ఉన్న డబ్బులతో వస్తున్న వడ్డీతోనే నెలకు రూ.2 కోట్లకు పైగా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. కానీ పీసీబీ ఛైర్మన్ కనీసం బోర్డు మీటింగ్ కూడా నిర్వహించకపోవడం వల్ల కార్యాలయంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం, పీసీబీ అధికారులు పరిశ్రమలు, నాలాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.