సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నార్త్‌సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ విధానాలు శాపంలా మారాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తేవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 30 లక్షల వరకు జనాభా ఉండే నార్త్‌సిటీ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలు కరువయ్యయాని స్థానికులు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నార్త్ సిటీ ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో జాతీయ రహదారిపై ఎక్స్‌ప్రెస్ వే పనులకు శ్రీకారం చుట్టింది. అయితే తదనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే.. ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేవలం కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనే ఒకే ఒక్క కారణంతో సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర కిందట అట్టహాసంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారనే విమర్శలున్నాయి.
అయితే భూసేకరణలో ప్రజల నుంచి వ్యతిరేకత, కంటోన్మెంట్ భూముల విషయంలో కేంద్రంతో కుదరని సయోధ్య, నిధుల లేమి వెరసి ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారయ్యాయి. నార్త్ సిటీతో పాటు నార్త్ తెలంగాణకు ప్రధాన రహదారిలో చేపట్టే ఈ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తోంది. ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టులను జాప్యం చేస్తుండటంతో నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యానికి తోడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పనులను పర్యవేక్షించడంలో జాప్యం చేస్తోంది. అదేవిధంగా కనీసం రాష్ట్ర సర్కారైన సుచిత్ర నుంచి మేడ్చల్ వరకు అందుబాటులోకి రావాల్సిన ఫ్లైఓవర్‌ను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు అత్యంత కష్టంగా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు.
కొంపల్లి- మేడ్చల్ హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుచిత్ర సర్కిల్ నుంచి మొదలుకుని, మేడ్చల్ వరకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడి నుంచి అంతర్ రాష్ట్ర సరుకు రవాణా కార్యాకలాపాలు విస్తృతంగా సాగుతాయి. అయినప్పటికీ ఫ్లైఓవర్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు మండిపడుతున్నారు. కనీసం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి ఉంటే.. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓల్డ్ ఆల్వాల్, నార్త్ ఆల్వాల్, మంజీరా నగర్, హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ, పంచశీల ఎన్క్లేవ్, ఆల్వాల్ హిల్స్, బొల్లారం, మచ్చబొల్లారం, ఎన్సీఎల్, బీమా ప్రైడ్, ..లక్ష్మీ గంగా ఎన్క్లేవ్, టీఎన్ఆర్ నార్త్ సిటీ ప్రముఖ కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసితులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తా యి. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం నగరానికి వచ్చే వాహనదారులకు కూడా ఇబ్బందులు తొలిగిపోయేవి.
ఇక నార్త్ సిటీలోని జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి కాకపోవడంతో అట్టహాసంగా నెలకొల్పిన శిలాఫలకం బోసిపోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి సారిగా వేసిన తొలి శిలాఫలకం ఇదే కావడం గమనార్హం. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే మెరుగైన రవాణా, మెట్రో అందుబాటులోకి వచ్చేది. కానీ ప్రభుత్వం చేస్తున్న కాలయాపన, ఎలివేటెడ్ భూసేకరణలో తప్పుడు విధానాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. దీంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
కుత్బుల్లాపూర్, నవంబర్23: సుచిత్ర నుంచి మేడ్చల్ వరకు సాగుతున్న జాతీయ రహదారి-44 విస్తరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేశారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులతో పాటు వంతెన నిర్మాణ పనులతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయని, సింగిల్ మార్గం గుండా రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు మండిపడ్డారు. దీని కారణంగా అత్యవసర పనుల నిమిత్తం ఈ ప్రాంతం గుండా రావాలంటే నానా తంటాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తిచేయాలని చర్యలు వారు డిమాండ్ చేశారు.