Musi River | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 16 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో మూసీ పరివాహకంలోని పలు నిరుపేదల ఇండ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు నగరంలోని పలుచోట్ల హైడ్రా చెరువుల అభివృద్ధి కోసం పట్టా భూములను సైతం తీసుకోవడం వివాదాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఒకవైపు మూసీ సుందరీకరణలో నిర్మాణాలు, భూములు కోల్పోయేవారిని పెద్ద ఎత్తున ఆదుకుంటామంటూ సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ప్రకటించారు.
అయితే వారికి నేరుగా నగదు కాకుండా టీడీఆర్ రూపంలో పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రత్యేకంగా నదులు, చెరువుల వద్ద ప్రభుత్వం భూములను తీసుకున్నట్లయితే ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2012లో జారీ చేసిన భవన నిర్మాణ నిబంధనల జీవో 168కు సవరణలు చేస్తూ శుక్రవారం జీవో 16 జారీ చేసింది. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులనుప్రభుత్వానికి అప్పగించే యజమానులకు బదిలీ చేసే అభివృద్ధి హక్కుల నిబంధనలను (టీడీఆర్) భారీగా మార్పులు చేశారు.
టీడీఆర్ జారీకి ముందు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేదా అదనపు కలెక్టర్ ర్యాంకు అధికారుల క్లియరెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూముల విషయంలో టీడీఆర్ జారీకి ముందు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో టీడీఆర్‌ను నేరుగా ఇవ్వకుండా టీడీఆర్ బ్యాంక్‌లో భద్రపరుస్తారు. సమస్య పరిష్కారమైన తర్వాతే సంబంధిత యజమానికి దాన్ని బదిలీ చేస్తారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన లేక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు భూ యజమానుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం ఎఫ్టీఎల్, బఫర్‌తో పాటు పరివాహకంలో రెండువైపులా ఎంత దూరం అభివృద్ధి చేస్తుందనే దానిపై ఆది నుంచి ఆందోళన నెలకొని ఉంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో నదికి రెండువైపులా కిలోమీటరు మేర భూముల్ని తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
కానీ ఆచరణలో అది సాధ్యమా? నది పరివాహకంలో రెండువైపులా కిలోమీటరు అంటే లక్షలకొద్దీ నిర్మాణాలు ఉన్నందున ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా టీడీఆర్ సవరణలో ఎఫ్టీఎల్, బఫర్‌తో పాటు బఫర్ అవతల ఉన్న భూముల సేకరణపై ఏకంగా 400 టీడీఆర్ ఇస్తున్నట్లు పొందుపరిచారు. దీంతో కచ్చితంగా ప్రభుత్వం మూసీ సుందరీకరణలో భాగంగా బఫర్‌జోన్ అవతల కూడా భూముల్ని సేకరించే యోచనలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంకోవైపు హైడ్రా పలుచోట్ల చేపట్టిన చెరువుల అభివృద్ధిలో పట్టా భూముల్ని సైతం తీసుకుంటుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు… సున్నం చెరువు పరిధిలో సియెట్ కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలంటూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో తాజా టీడీఆర్ సవరణ జీవోతో ఆ మేరకు పరిహారంగా టీడీఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు స్పష్టమవుతున్నది.