 
                                                            మేడ్చల్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయలేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 138 మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయగా..ఇందులో మేడ్చల్ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే మంజూరు కాగా..మిగతావాటికి కాలేదు. జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో మేడ్చల్, గుండ్లపోచంపల్లి, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలకు మాత్రమే నిధులు మంజూరు కాలేదు.
ప్రభుత్వ ప్రకటనతో మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అధికారులు సైతం ఎన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశామన్నా విషయమై నిర్ధారించడం లేదు. గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో నిధులు లేక ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయి. నిధులురాని మున్సిపాలిటీల్లో త్రీవ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. శివారు మున్సిపాలిటీల్లోని నూతన కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తదితర అవసరాలు ఉన్నాయి. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
                            