KBR Park Project | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు పనులు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారుతోంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంగా రూ. 1090 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులకు గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన ప్రజా పాలన ఏడాది విజయోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అధికారులు గడిచిన నాలుగు నెలలుగా పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఈ ప్రాజెక్టుకు ముందు నుంచి సరైన ప్రణాళిక లోపించింది. భూ సేకరణపై విధి విధానాలు రూపొందించకపోవడం, కేబీఆర్ పార్కు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం భూ సేకరణపై ఎలాంటి స్పష్టత లేకుండా ముందుకు సాగారు. ఫలితంగా క్షేత్రస్థాయిలోకి దిగిన అధికారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇప్పటికే వ్యతిరేకించి కేబీఆర్ పార్క్ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేసిన కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని నిలువరించేలా, పర్యావరణాన్ని పెంపొందించాలని ఎన్జీటీలో నమోదైన కేసు పెండింగ్‌లో ఉంది. తాజా గా ఆ పార్టీ నేతకు తోడుగా ఓ న్యూస్ యాజమా న్యం, బసవ తారకం క్యాన్సర్ దవాఖాన సమీపం లో మరో యాజమానులు వేర్వేరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దీంతో రోజురోజుకు న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోతున్న ఈ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలు కావడం కష్టంగానే ఉందని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.
బంజారాహిల్స్ రోడ్ నం 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా గతంలోనే పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన స్థలంలో 266 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగ భాగం విస్తరణలో కోల్పోనుంది.
ఇక జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు. సుమారుగా తన ప్లాట్‌లో 377 గజాల వరకు కోల్పోనున్నారు. ఈ రహదారి విస్తరణలోనే మరికొంత మంది ప్రముఖులు ఉన్నారు. మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి 205 గజాల స్థలాన్ని కోల్పోగా, అల్లు అర్జున్ మరో బంధువు శరత్‌కి చెందిన 134గజాల స్ధలాన్ని కోల్పోనున్నారు. ఇక సీవీఆర్ సంస్థ 480 గజాల స్థలాన్ని కోల్పోవాల్సి వస్తుండటంతో ప్రాజెక్టు భూసేకరణ కొలిక్కి రావడం లేదు. బంజారాహిల్స్ రోడ్ 12 విరంచి ఆసుపత్రి నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది.
దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తులు సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఆస్తిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోలేదు. కానీ ప్రాజెక్టును నిలవరించేలా కోర్టులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండు ప్యాకేజీల్లో కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ గేటు నుంచి జూబ్లీ చెక్ పోస్టు వరకు, బసవ తారకం హాస్పిటల్ మీదుగా అగ్రసేన్ విగ్రహం మీదుగా అండర్ పాస్, ఫ్లైఓవర్లను రూ. 1090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు టెండర్లు పిలవగా, మార్చి 26తో ప్రక్రియ ముగిసింది. టెండర్ కమిటీ దశలో ఉంది. త్వరలో టెండర్‌ను ఖరారు చేసిన భూ సేకరణపై స్పష్టత లేకుంటే పనులు జరపలేని పరిస్థితి నెలకొంది.
కేబీఆర్ పార్కు చుట్టూ అగ్రసేన్, ఫిలింనగర్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం ఇలా ఆరు జంక్షన్లు ఉన్నాయి. ఈ ఆరు జంక్షన్లలో 8 స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణం జరగనుంది. జూబ్లీహిల్స్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెండు చొప్పున నాలుగు స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగతా నాలుగు జంక్షన్ల వద్ద ఒక్కో స్టిల్ బ్రిడ్జి, ఆరు జంక్షన్ల వద్ద ఒక్కొక్కటి చొప్పున ఆరు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి రోడ్డు నంబర్ 45 వైపు వచ్చే ఫ్లై ఓవర్‌పై భాగంలో రెండు లేన్లతో రానుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెల్లే నాలుగు లేన్ల కింద నుంచి వెళ్లనుంది. ఈ నిర్మాణాలతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని గతంలో పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించడం, పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తుండడం, వీరికి తోడుగా భూ బాధితులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తుండడం ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు పోయే పరిస్థితులు కనబడటం లేదు.