సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బంజారాహిల్స్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : : సాధారణంగా ఉప ఎన్నిక వస్తే రాజకీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చాక అన్యాయానికి గురై విసిగివేసారి నామినేషన్లతో తిరుగుబాటు చేసిన రైతులు, నిరుద్యోగులు, ఫార్మా బాధితులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాల సంఘాల ప్రతినిధులు ఇలా ఆయా వర్గాలన్నీ ఈ ఉప ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై గుర్రుగా ఉన్న సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఇదే మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. హైడ్రా పేరుతో బుల్డోజర్ దింపడం.. సినీ పరిశ్రమ అగ్రనటులు నాగార్జున, అల్లు అర్జున్‌పై ఉక్కుపాదం మోపి కక్షసాధించడం, కార్మికుల 30శాతం వేతన పెంపుపై సర్కారు నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇన్నాళ్లు ధర్నాలు, దీక్షలు చేసినా పట్టించుకోని ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు వారంతా సిద్ధమవుతున్నట్టు జోరుగా చర్చ జరుగుతున్నది.
రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న వర్గాలకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అస్త్రంగా మారనున్నదా? నిరసనలు.. దీక్షలు.. రాస్తారోకోలు చేసినా పట్టించుకోని సర్కారుకు గుణపాఠం చెప్పేందుకు వారందరూ ఏకమవుతున్నారా? తాజా పరిణామాలను పరిశీలిస్తే నిజమేననిపిస్తున్నది. నిన్నటికి నిన్న నగర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా నామినేషన్లతో సబ్బండవర్గాలు సర్కారుపై తిరుగుబాటు ప్రకటించాయి. తాజాగా సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కార్మికులు సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఒకవైపు సినీ పరిశ్రమలోని కీలకమైన వారిని వేధింపులకు గురిచేయడంతో పాటు చివరకు కార్మికుల వేతనాల పెంపు విషయంలోనూ నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికలోకం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా వేతనాల పెంపు కోసం జరిగిన సమ్మెను రాత్రికి రాత్రి వారి సమ్మతి లేకుండానే నిర్వీర్యం చేసిన యూనియన్ నాయకుడు కాంగ్రెస్ పంచన చేరడంతో కార్మికుల ఆగ్రహం రెట్టింపయినట్లు స్పష్టమవుతున్నది. అందుకే ఇప్పుడు ఏ కార్మికుడిని తట్టినా సమస్యలను ఏకరువు పెట్టి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఇప్పడు సర్కారు వర్సెస్ సబ్బండ వర్గాలు అన్నట్టు మారింది. నామినేషన్ల ఘట్టమే ఇందుకు తసాక్ష్యంగా నిలిచింది. ఒక విధంగా అధికార కాంగ్రెస్‌కు ఈ పరిణామం ముచ్చెమటలు పట్టించిందని ఆ పార్టీ వర్గాలే అంతర్గతంగా చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంలో సర్కారు వ్యతిరేక వర్గాల దూకుడు కనిపిస్తున్నది. ముఖ్యంగా నామినేషన్లను పెద్ద ఎత్తున తిరస్కరించడంపై రైతులు, నిరుద్యోగులు, ఫార్మా బాధితులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాల సంఘాల ప్రతినిధులు ఇలా అనేక వర్గాలు ప్రచారంలో హస్తం పార్టీకి తమ సత్తా చూపించాలనే నిర్ణయానికొచ్చినట్లుగా ఆయా వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక నామినేషన్లలో పాల్గొనకుండా కేవలం ప్రచారంలోనే తమ ఆక్రోశాన్ని వెల్లగక్కేందుకు కూడా కొన్నివర్గాలు ముందు నుంచి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ భూ బాధితులు మొదటినుంచీ ప్రచారంలో సర్కారు దమననీతిని ఎండగడతామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సినీ కార్మికులు నెమ్మదిగా తెరపైకొస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలవడంతో పాటు పరిశ్రమ వారితో స్నేహపూరిత వాతావరణాన్ని నిర్వహించింది. కానీ రెండేళ్లలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని కార్మికులే చెబుతున్నారు. పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన సుమారు 10వేల మంది కార్మికులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నట్లు తెలుస్తున్నది. కృష్ణానగర్ ఏ-బ్లాక్, బీ-బ్లాక్,వెంకటగిరి, హైలమ్ కాలనీ, యూసుఫ్‌గూడ, జవహర్ నగర్ తదితర బస్తీల్లో ఎక్కువగా వీళ్లు నివాసం ఉంటున్నారు. ఇందిరానగర్ ప్రాంతంలోని పలు యూనియన్లలో సినీ కార్మికులు సభ్యులుగా ఉన్నారు. అత్యధికంగా జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్‌లో సభ్యులు ఉంటారు.
దీంతో పాటు ఫైటర్స్, డ్యాన్సర్, సెట్ అసిస్టెంట్స్, మేకప్ ఆర్టిస్ట్స్, ప్రొడక్షన్ యూనియన్లతో సహా మొత్తం 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు ఇక్కడ ఉంటారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్లలో సుమారు 30వేల మంది వరకు సభ్యులుంటారు. వీరిలో సుమారు 10వేల మంది చిత్రపురికాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మరో 10వేల మంది ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని సొంతూళ్లలో ఓటు హక్కు కలిగి ఉంటారని తెలుస్తోంది. వీరిని మినహాయిస్తే సుమారు 10వేల మంది కార్మికులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై వీరిలో నెలకొన్న ఆగ్రహం ఈ ఉప ఎన్నికలో ప్రతిబింబించనున్నదా? అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే హైడ్రా పేరుతో హీరో నాగార్జునపై బుల్డోజర్ పంజా విసిరింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో సీఎం రేవంత్ వర్సెస్ నాగార్జున అన్నట్లుగా మారిన పరిస్థితి వెనక ఉన్న కారణాలపై అనేక విశ్లేషణలు, అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా నాగార్జునను ఒక సందర్భంగా కొనియాడినప్పటికీ సామాజికంగా చేసిన డ్యామేజీ మాత్రం సినీవర్గాల మదిలోనే ఇప్పటికీ కదలాడుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే హీరో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాపై చోటుచేసుకున్న పరిణామాలు, అరెస్టు, జైలు వంటివి దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఒక వేదికపై సీఎం పేరును మరచిపోయారనే అక్కసుతోనే ఇదంతా చేశారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరగడమే కాదు సినీ వర్గాల్లోనూ అదే అభిప్రాయం ఉన్నట్టు తెలిసింది. కాగా మూడు రోజుల కిందట సీఎం రేవంత్ అల్లు అర్జున్‌కు చెందిన ఒక భవనాన్ని ఆనుకొని ఉన్న పార్కు స్థలంలో రూ.1.60 కోట్ల పనులను ఆకస్మికంగా పరిశీలించడం కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది.
ఇటీవల సినీ కార్మికులు వేతన పెంపు కోసం సమ్మెబాట పట్టారు. హైదరాబాద్ వేదికగా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవచూపలేదు. సంబంధిత మంత్రి సహా ఇతర పెద్దలెవరూ దీనిపై కనీసం దృష్టి పెట్టలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగితే గానీ నామమాత్రంగా రేవంత్ సర్కారు చొరవ చూపిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో 30 శాతం వేతన పెంపు డిమాండుతో కార్మికులను సమ్మెలోకి దింపిన ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ కార్మికుల అభిప్రాయాల్ని పరిగణలోనికి తీసుకోకుండా, అసలు వారిని సంప్రదించకుండానే రాత్రికి రాత్రి 15 శాతం పెంపునకు అంగీకరించడంపై కార్మికులు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు.
అయితే ఇప్పుడు సదరు అనిల్‌కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌కు మద్దతుగా నిలవడంతో ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మె విరమణలోనే కాదు.. ఇప్పుడు రాజకీయంగానూ ఏకపక్షంగా అనిల్‌కుమార్ ప్రకటనలపై కార్మికులు భగ్గుమంటున్నారు. చిత్రపురి కాలనీలో అనేక అక్రమాలకు పాల్పడిన వల్లభనేని అనిల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అడ్డుపెట్టుకొని కార్మికుల ఓట్లతో కొట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కార్మికులే ఆరోపిస్తున్నారు. దీంతో రెండేళ్ల పరిణమాలతో పాటు అనిల్‌కుమార్ ఎపిసోడ్‌తో కార్మికలోకం కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నట్లుగా విశ్లేషణలు చెబుతున్నాయి.
బంజారాహిల్స్, అక్టోబర్ 27 : ‘వేలాది మంది సినీ కార్మికులకు దక్కాల్సిన చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఫ్లాట్లను బయటి వ్యక్తులకు అమ్ముకొని భారీ స్కామ్ చేసి జైలుకు వెళ్లొచ్చిన తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ లాంటి వ్యక్తులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన సినీ కార్మికులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేసిన వ్యక్తికి, ఆయన మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి సినీ కార్మికులు మద్దతు ఇస్తారా?’ వారి మద్దతు ఎటువైపు..?’ అంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.