Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. నాలుగు నెలలు గడిచినా అడుగు కూడా ముందుకు పడకపోగా, ప్రభుత్వ అజ్ఞానం వల్ల ప్రాజెక్టు మొత్తం గందరగోళంలో చికుకుందంటూ..తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
– సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మెట్రో టేకోవర్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన ట్రాన్సాక్షనల్ అడ్వైజర్ వ్యవహారం ఇప్పుడు నవ్వులపాలవుతోంది. మెట్రో రైలు అంటే కేవలం లెకలు చూసే వ్యాపారం కాదని, అందులో సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉంటాయన్న కనీస సృ్పహ సరారుకు లేకుండా పోయింది. కనీసం మెట్రో సాంకేతికతపై అవగాహన లేని సంస్థను అడ్వైజర్‌గా ఎంపిక చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నది. కాగా, ఇప్పుడు మళ్లీ కొత్త అడ్వైజర్‌ను వెతుకోవడానికే మరో ఆరు నెలలు పడుతుందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అంటే మెట్రో విస్తరణ దాదాపు మరో ఏడాది పాటు మూలన పడినట్లేనని స్పష్టమవుతోంది.
మెట్రో టేకోవర్‌కు అవసరమైన రూ. 15వేల కోట్ల నిధులు ఎకడి నుంచి వస్తాయన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఖజానాపై ఈ అదనపు భారం మోపడం ఆత్మహత్యాసదృశ్యమేనని ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ప్రజా ఆస్తులైన మెట్రో భూములు, మాల్స్‌ను విక్రయించి నిధులు మళ్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. మెట్రో కోసం ఎల్ అండ్ టీకి లీజుకు ఇచ్చిన 200 ఎకరాల విలువైన భూములు, షాపింగ్ మాల్స్ విక్రయించి నిధులు సమకూర్చాలనే యోచన ప్రభుత్వం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది భవిష్యత్ తరాల ఆస్తులను అప్పనంగా అమ్మేయడమేనని నిపుణులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల మెట్రో రెండో దశ విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. 44 వేల కోట్లతో రూపొందించిన ప్లాన్లకు ఎల్ అండ్ టీ పాత్ర తేలే వరకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. మధ్యేమార్గంగా ఒప్పందం చేసుకోవాల్సింది పోయి, మొండిగా టేకోవర్ ప్రతిపాదన తెచ్చి మెట్రో భవితవ్యాన్ని ప్రభుత్వం ప్రమాదంలో పడేసింది.
న్యాయపరమైన చికులు, ఎల్ అండ్ టీ కుదుర్చుకున్న లీజు ఒప్పందాలను అధ్యయనం చేయకుండా హడావుడిగా టేకోవర్ చేస్తే ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఉన్నతాధికారులే భయపడుతున్నారు. ఆర్భాటపు రాజకీయాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని పణంగా పెడుతున్న కాంగ్రెస్ తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.