సిటీబ్యూరో, జనవరి 30(నమస్తే తెలంగాణ) : హైరైజ్ ప్రాజెక్టులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తాయి. కానీ మౌలిక వసతులపై ముందు చూపు లేకపోతే జరగబోయే పరిమాణాలు, నగర వాసుల పాలిట శాపంగా మారతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది హైరైజ్ ప్రాజెక్టులను పలుకుబడి కోసం ఆమోదిస్తూ పట్టణీకరణ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేసేందుకు సన్నద్ధమవుతున్నది.
చైనాలోని ప్రధాన నగరాల్లో మాత్రమే విస్తృతంగా కనిపించే ఈ తరహా నిర్మాణాలకు గడిచిన రెండేండ్లలో 400కు పైగా అనుమతులు మంజూరు చేసింది. కేవలం ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం దృష్టి పెట్టిన సర్కారు.. మౌలిక వసతులను మాత్రం విస్మరించింది. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశ, విదేశీ నగరాలతో పోటీ పడుతోంది. ముఖ్యంగా చైనా, సింగపూర్, న్యూయార్క్, దుబాయ్‌తోపాటు, ముంబై, బెంగుళూరు, పుణే, కోల్‌కతా, గుర్గావ్, నోయిడా వంటి నగరాల సరసన నిలిచేలా నగరంలో హైరైజ్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నాయి.
ప్రస్తుతం నగరంల 407 స్కై స్క్రాపర్లు ఉండగా, 2031 నాటికి ఈ సంఖ్య ముంబై తరహాలో పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చైనాలోని షాంఘై, బీజింగ్, చాంగింగ్ వంటి నగరాలు అత్యధిక హైరైజ్ ప్రాజెక్టులు కలిగిన జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక దేశంలో ముంబైని అధిగమించేందుకు హైదరాబాద్ శరవేగంతో దూసుకుపోతున్నది. కానీ మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో సర్కారు దృష్టి పెట్టడం లేదు.
నగరంలో ప్రస్తుతం ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న వెస్ట్ సిటీ ప్రాంతం నుంచి అవుటర్ రింగు రోడ్డు దాటి మరి వర్టికల్ గ్రోత్ శరవేగంతో దూసుకుపోతున్నది. భవన నిర్మాణ రంగ అనుమతుల్లో వచ్చిన మార్పులు, విస్తృతమై ప్రైవేటు పెట్టుబడులతో ఆకాశ హర్మ్యాల నిర్మాణం గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న ఆదరణతో కొత్త బిల్డర్లు కూడా ఈ తరహా నిర్మాణాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ మౌలిక వసతుల విషయంలో కాంగ్రెస్ సర్కారు వెనుకబడిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం ఆకాశ హర్మ్యాల నిర్మాణ అనుమతుల ఫీజులతో వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నది.
కానీ మెరుగైన రహదారులు, తాగునీటి వసతులు, ప్రజా రవాణా వ్యవస్థ అనుసంధానం, ట్రాఫిక్ నియంత్రణ, జనసాంద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టడం లేదు. అనుమతులు వస్తున్నాయి. కానీ భవిష్యత్ ప్రణాళికలు లేకపోవడంతో నగరంలో హైరైజ్ ప్రాజెక్టులతో పెను ప్రమాదమే పొంచి ఉందనే అభిప్రాయం బిల్డర్ల నుంచి వ్యక్తమవుతున్నది. నగరంలో మౌలిక వసతులకు పెద్దపీట వేయాల్సి ఉన్నా… కేవలం జనాలు లేని ఫ్యూచర్ సిటీకి మెట్రోను పరుగులు పెట్టించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. కానీ వేలాది మందిని ప్రమాదంలో పడేస్తున్నది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇప్పటికే నగరంలో నీటి ఎద్దడి సమస్యలు వస్తున్నాయి. కానీ సర్కారు మాత్రం ఈ విషయంలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందించలేదు.