సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది గోరంత అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులను కూడా తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటున్నది. కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను జతచేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను జతచేసుకున్న వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులుగా ప్రకటించుకుంటున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కంటే కుటుంబ సభ్యులను జత చేసుకునేందుకే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలోనూ కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 2 లక్షల 30 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పాత కార్డుల్లో పేర్లను జతచేసుకునేందుకు 2 లక్షల 50 వేలకు పైగా వచ్చాయి. అయితే అన్నింటినీ కలిపి హైదరాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6 లక్షలకు పైగా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. తాము చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలకు అలవాటుగా మారిందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో గడిచిన 6 నెలల నుంచి మీసేవ, ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 2.3 లక్షల పైగానే దరఖాస్తులు చేసుకున్నారు. వీటితో పాటు మెంబర్ యాడింగ్కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త కార్డుల కోసం వచ్చిన 2.3 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు కేవలం 60వేలకు పైగా మాత్రమే స్క్రీనింగ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇందులో సుమారు 50 వేల లోపు కార్డులు మాత్రమే మంజూరైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు ఇంకా 1.5 లక్షల దరఖాస్తులు పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అర్హులందరికీ రేషన్‌కార్డులు అందాలంటే కనీసం మరో 3 నెలలకు పైనే సమయం పట్టేలా ఉందని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాలుగా తనిఖీలు చేసి, దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి అర్హులను గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.
హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తున్నది. కొత్త కార్డులకు 2.3 లక్షల దరఖాస్తులొస్తే ఇప్పటి వరకు 50 వేల కార్డులు కూడా పంపిణీ చేయలేదు. పౌరసరఫరాల శాఖతో పాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కూడా రేషన్ కార్డుల పంపిణీలో భాగం అవుతున్నా ఎందుకింత జాప్యం చేస్తున్నారని దరఖాస్తుదారులు నిలదీస్తున్నారు.
దరఖాస్తు చేసుకుని 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ తమ ఇండ్లకు ఎంక్వైరీకి రాలేదని పలు డివిజన్ల ప్రజలు వాపోతున్నారు. విచారణ పూర్తయి మూడు నెలలు దాటిన వారి అప్లికేషన్ స్టేటస్ కూడా ఇంకా పెండింగ్ అనే వస్తుందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వమేమో నగరంలో అత్యధికంగా 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నా.. అధికారులు మాత్రం ఇప్పటికి 20 శాతం కూడా పూర్తి చేయకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్నారు.