చిక్కడపల్లి, ఏప్రిల్ 24: తెలంగాణ సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాలను తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. బాగ్‌లింగంపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా తమకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లును అడిగితే అరెస్టు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని సుర్వి యాదయ్య గౌడ్ వాపోయారు. గత ప్రభుత్వంలో మీరు పనులు చేశారని బిల్లులు ఇవ్వకుండా కక్షపూరితంగా పెండింగ్ పపెట్టారని ఆరోపించారు. తాము సర్పంచ్‌గా ఉన్నప్పుడు భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలోనే అభివృద్ధి చేశామనే తమకు ఖ్యాతి లభించిందని అన్నారు. దీనికిగాను అనేక అవార్డులు వచ్చాయని వివరించారు. తమకు రావలసిన బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేసిన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. తాము ప్రజా కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. తమ పెండింగ్ బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న 600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.